రాయచోటి ప్రాంతంలో సాగులో ఉన్న జీలుగ పంట
రాయచోటి : రైతులు జీలుగ, పిల్లిపెసర, సాగు చేస్తే చక్కటి ఫలితాలు సాధించవచ్చు. తక్కువ సారవంతమైన భూముల్లో నల్లటి మట్టిని వేస్తే మంచి దిగుబడులు వస్తాయి. రైతులు మట్టిని వేసే బదులు నేల స్వభావాన్ని బట్టి పచ్చి రొట్ట ఎరువుల సాయంతో మరింత సారవంతంగా మార్చుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఖరీఫ్ సాగును దష్టిలో పెట్టుకొని రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో గ్రామాల్లో సదస్సులు నిర్వహించి ప్రకృతి సిద్ధంగా లభించే ఎరువులు, వాటి ఉపయోగాల గురించి వివరిస్తున్నారు. రైతులు కూడా పచ్చి రొట్ట సాగు విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లి పెసర సాగుపై మక్కువ చూపుతున్నారు. ఇందుకు అవసరమైన పచ్చిరొట్ట సాగు విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోంది.సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
లాభాలు ఇవీ..
● పొలంలో జీలుగను కలియదున్నిన తర్వాత అవి నేలకు, తర్వాత వేసే పంటలకు విశేషమైన లాభాలు అందిస్తుంది.
● ప్రధాన పంటకు ముందస్తుగా నేలను తయారు చేస్తుంది.
● జీలుగ సాగుతో మూడు టన్నుల పచ్చిరొట్ట ఎరువు లభిస్తుంది.
● మొక్కలకు 2 శాతం నత్రజని, సూపర్ పాస్పేట్‌ను అదనంగా అందిస్తాయి.
● జింక్ మాంగనీస్, ఇనుము, క్యాల్షియం వంటి సూక్ష్మధాతువులను పంటకు చేకూరుస్తాయి.
● నేలపై కరగని మూలకాలను పంటకు అనుకూలంగా మారుస్తాయి.
● నీటి నిల్వ సామర్థ్యాన్ని అధికంగా పెంచుతుంది
● వానపాముల ఉత్పత్తికి దోహదం చేస్తాయి.
● లెగ్యూ జాతికి చెందిన మొక్కకావడంతో వేర్లలో నత్రజని స్థిరీకరణ అధికంగా ఉంటుంది.
● తుంగ, గరిక వంటి కలుపు మొక్కలను అడ్డుకుంటుంది.
అధిక దిగుబడులనిచ్చే పచ్చి రొట్టెసాగుపై అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు
అందుబాటులో విత్తనాలు
ప్రభుత్వం సబ్సిడీపై జీలుగ విత్తనాలను ఆయా మండల, గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది. ఏక వార్షిక మొక్కల్లో ప్రథమస్థానం వీటికే దక్కుతుంది. మొక్కలు నాటిన 30–35 రోజుల్లోనే ఏపుగా పెరుగుతాయి. దుక్కిలో 30 కిలోల యూరియా వేసిన తర్వాత ఎకరానికి 12 కిలోల జీలుగ విత్తనాలు చల్లుకోవాలి. జీలుగను సాగు చేసిన తర్వాత 30 రోజుల్లో ఏపుగా పెరిగి పూతదశకు చేరుకుంటుంది. ఆ సమయంలో మొక్కలను మొదళ్ల వద్ద కత్తిరించాలి.లేకపోతే రొటోవేటర్ సాయంతో పొలమంతా కలియదున్నాలి.తర్వాత 100 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్‌ను దుక్కిలో వేయాలి. సూపర్ పాస్పేట్ వల్ల మొక్కల అవశేషాలు బాగా కుళ్లి పచ్చిరొట్ట ఎరువుగా తయారవుతుంది. పొలంలో జీలుగ, జనుము, పిల్లి పెసర కుళ్లే దశలో నీటిని సక్రమంగా అందించాలి. 10 కిలోల బ్యాగును 50 శాతం సబ్సిడీతో ప్రభుత్వం విక్రయిస్తోంది. – ఉమామహేశ్వరమ్మ, జిల్లా వ్యవసాయాధికారిణి
సబ్సిడీపై జీలుగ విత్తనాలు
జీలుగ విత్తనాలు రైతుభరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రైతుకు 30 కిలోల విత్తనాలను అందజేస్తాం. ప్రభుత్వం సబ్సిడీపై అందజేసే విత్తనాలను రైతులు సకాలంలో తీసుకొని చల్లుకోవాలి – దివాకర్‌బాబు,
మండల వ్యవసాయాధికారి, రాయచోటి
మంచి లాభాలు పొందాలి
జీలుగ ఇతర పచ్చి రొట్ట విత్తనాలను రైతులు కొనుగోలు చేసి వాటితో వచ్చే లాభాలు పొందాలి. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలను రైతులు కొనుగోలు చేస్తున్నారు. – వేంపల్లి అఫ్రిన్,
రైతు భరోసా అధికారిణి, చాకిబండ
Comments
Please login to add a commentAdd a comment