కనుల పండువగా గోదా కల్యాణం
వల్లూరు : వైఎస్సార్ జిల్లా పుష్పగిరిలో కొండపై గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం శ్రీ గోదాదేవి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ మహా విష్ణువు అంశయైన శ్రీ చెన్న కేశవ స్వామికి, శ్రీ మహా లక్ష్మి అంశయైన గోదాదేవికి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త దుగ్గిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన ఆలయ మండపంలోని వేదికపై అలంకార భూషితులైన శ్రీ చెన్న కేశవ స్వామి, శ్రీ గోదాదేవిలు ఆశీనులవగా మంగళవాయిద్యాల నడుమ, వేద మంత్రాలతో కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో హాజరై కల్యాణోత్సవాన్ని తిలకించి తన్మయత్మం చెందారు. ఈ సందర్బంగా కొండ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మార్మోగింది. కాగా తెల్లవారు జామున ధనుర్మాస ప్రాతఃకాల పూజను జరిపారు. ఉదయం స్వామివారికి బిందె తీర్థ సేవను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త వెంకట సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment