ప్రైవేటు చేతికి హార్సిలీహిల్స్?
సీఎం దృష్టికి తెచ్చాం
టురిజంకు చెందిన యూనిట్లను ప్రైవేటుకు అప్పగించరాదని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాం. ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అండగా నిలవాలని కోరాం. హార్సిలీహిల్స్ యూనిట్ నుంచి మంచి ఆదాయం వస్తోంది. దీన్ని ప్రైవేటీకరించవద్దని కోరాం. మిగిలిన టూరిజం సమస్యలపైనా సీఎంకు వినతిపత్రం అందించాం.
– పీటీ.ప్రసాద్, జనరల్ సెక్రటరీ, టూరిజం ఉద్యోగం సంఘం
బి.కొత్తకోట : బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ జిల్లాలో ఏకై క పర్యాటక కేంద్రం. రాష్ట్రంలో ఏకై క పర్వత నివాస ప్రాంతం కూడా ఇదే. తిరుపతి డివిజన్ పరిధిలోని హార్సిలీహిల్స్ టూరిజం యూనిట్‌ను ప్రైవేటుకు అప్పగించే యత్నాలు మొదలయ్యాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ప్రైవేట్ ప్రతినిధులు హార్సిలీహిల్స్‌పైనున్న టూరిజం ఆస్తులపై పరిశీలన పూర్తి చేసినట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలో హార్సిలీహిల్స్‌ను ప్రైవేటు పరంపై ఆందోళన తీవ్రమైంది. ఈ విషయమై ఇటీవల సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా యూనియన్ నేతలు వినతిపత్రం అందించారు.
రూ.9.13 కోట్లతో పనులు
హార్సిలీహిల్స్ అభివృద్ధి, అతిథి గృహాల ఆధునికీకరణపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధికి రూ.9.13 కోట్ల నిధులు కేటాయించింది. అతిథిగృహాల ఆధునికీకరణ, కొత్త నిర్మాణాల కోసం పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగించారు. 54 అతిథి గృహాలుండగా గవర్నర్ బంగ్లాను మినహాయించి మిగిలిన గదులకు రంగులు, కొత్తగా రెస్టారెంట్ భవనం నిర్మాణ పనులను హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. పర్యాటకశాఖ 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్‌లోపు 9 నెలల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుంది. వైల్డ్ విండ్స్ భవనంలోని 8, విండ్ విస్టిల్ భవనంలోని 6, విండ్‌ఫాల్ భవనంలోని 4 అతిథి గృహాలను కాంట్రాక్టర్‌కు అప్పగించింది. దీంతో 18 అతిథిగృహలను ఏప్రిల్ నెల నుంచి పర్యాటకులకు కేటాయించడం లేదు.
9నెలల్లో రూ.55 లక్షల నష్టం
ఏప్రిల్ నుంచి 18 అతిథి గృహాలను పనుల కోసం కాంట్రాక్టర్‌కు అప్పగించడం, వాటిని పర్యాటకులకు అద్దెకు ఇవ్వకపోవడంతో పర్యాటకశాఖకు గడచిన తొమ్మిది నెలల్లో రూ.55 లక్షల నష్టం వాటిల్లినట్టు ఉన్నతాధికారులకు సమాచారం. ఇంకా పనులు పూర్తి కాకపోవడంతో ఈ లెక్కన నెలకు కనీసం రూ.6లక్షల నష్టం భరించాల్సిందే. డిసెంబర్‌లో పనులు పూర్తి చేసి పర్యాటకశాఖకు భవనాలను అప్పగించాలి. ఆయితే ఇంతవరకు ఒక్క గది పని కూడా పూర్తి చేయకుండా జాప్యం చేస్తున్నారు. పనుల కోసం గదుల్లోని వాష్‌రూమ్‌ల గోడలను పడగొట్టారు. కిటికీలు, ఫర్నిచర్ తొలగించగా వాటి పనులు ఇంకా పూర్తి చేయించలేదు. ఎలక్ట్రికల్ పనుల పరిస్థితి అలాగే ఉంది. ఏప్రిల్ నెల నుంచి పనులు చేపట్టగా తొమ్మిది నెలలు గడిచినా ప్రయోజనం లేదు.
ఆదాయం లేదని చూపే యత్నం
హార్సిలీహిల్స్ యూనిట్‌ను ప్రైవేటుకు అప్పగించాలన్న యత్నాల్లో భాగంగానే ప్రభుత్వంలోని ఓ అధికారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఏటా రూ.3.50 నుంచి రూ.4.50 కోట్ల వరకు హార్సిలీహిల్స్ ఆదాయం ఉంటుంది. అలాంటిది గదుల పనులు పూర్తి చేయకుండా ఆదాయం తగ్గిపోయేలా చేస్తే దాన్ని ప్రైవేటుకు అప్పగించవచ్చన్న ఆలోచనతో ఇలా చేస్తున్నారని టూరిజం ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.కాగా హార్సిలీహిల్స్‌పై టూరిజం కార్యకలాపాలను చైన్నెకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధులు పరిశీలించి వెళ్లారని, దీనిపై ఓ అంచనాకు వచ్చారని చెబుతున్నారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
ఆదాయం తగ్గిందని చూపి
అప్పగించే వ్యూహం
9 నెలల్లో రూ.55 లక్షల నష్టం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
రూ.9.13 కోట్లతో ఆధునికీకరణ
కొత్తగా రెస్టారెంట్ భవన నిర్మాణాలు
ప్రైవేట్ కోసమే అంటున్న
టూరిజం వర్గాలు
Comments
Please login to add a commentAdd a comment