క్రషర్ స్థలంలో కోడిపందెం నిర్వహణ..
రాయచోటి : జిల్లాలో సంక్రాంతి పండుగ వేళ కోడిపందేలు జోరుగా జరుగుతున్నాయి. పదునెక్కిన కత్తులు కట్టిన కోళ్లను పోటీగా బరిలో దింపుతున్నారు. వీటికి పౌరుషాన్ని నూరిపోసి కథనరంగంలో కవ్విస్తున్నారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఎగిరి కాళ్లతో తన్నుకున్న కోడిపుంజులు రక్తపు మడుగులతో వీర మరణాలు చెందుతున్నాయి. ఈ పోరాటంతో వాటికి ప్రాణాలు పోతున్నా నిర్వాహకులకు, పందెం రాయుళ్లకు యమ కిక్కును తెప్పిస్తుంటాయి. ఇందుకోసం సంక్రాంతి పండుగ పేరుతో ఊరూరా పందేలు కొనసాగుతున్నాయి. వీటి నిర్వహణ కోసం కూటమి బడా నేతల నుంచి గ్రామ నాయకుల వరకు పోటీ పడుతున్నారు. సోమవారం ఉదయం నుంచి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పందెం రాయుళ్లు కోడిపుంజులతో బరులకు దిగుతున్నారు.ఈ సందర్భంగా లక్షలాది రూపాయలను పందేలుగా కట్టి చేతులు మారుస్తున్నారు. పట్నం వైపు పరుగులు తీసిన వారంతా సంక్రాంతి సందర్భంగా పల్లెలకు రావడంతో మోడుబారిన పల్లెలు కాస్త కళకళలాడుతున్నాయి. ఫలితంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కోడిపందేల నిర్వహణ పోటాపోటీగా సాగుతోంది. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు కోడిపందేల నిర్వహణకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. జిల్లా పరిధిలోని రాయచోటి, రాజంపేట, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, కోడూరు నియోజకవర్గాల్లోని అధికార పార్టీ ప్రధాన నాయకుల కనుసన్నల్లో కోడిపందేలు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు, పులివెందుల సబ్‌డివిజన్‌ల పరిధిల్లో మరీ విచ్చలవిడిగా జూదం, కోడిపందేలు సాగుతున్నాయి. పులివెందుల సబ్ డివిజన్ పరిధిలో లింగాల, చక్రాయపేట, వేంపల్లి, తొండూరు, సింహాద్రిపురం, వేముల, ఆర్‌కే వ్యాలీ మండలాల పరిధిల్లోని కొన్ని మారుమూల, కొండలు, గుట్టల ప్రాంతాల్లో, తోటల ప్రాంతాల్లో జూదం నడిపిస్తున్నారని తెలుస్తోంది.
అనేక ప్రాంతాల్లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరిలో లాగా బారికేడ్లను ఏర్పాటు చేసి కోడిపందెం ఆట ఆడిస్తున్నారు. పందెం కట్టిన కోడికి రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్థానికంగా ఉన్న యువత పెద్ద ఎత్తున బరుల వద్దకు చేరుకుని పందేలు కాస్తున్నారు.
పోలీసుల హెచ్చరికలు చేస్తున్నా..
కోడిపందెంలు, జూద శాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు అధికారుల హెచ్చరికలు అధికార పార్టీ నాయకులకు ఏ మా త్రం ఖాతరు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. స్థానిక నాయకులు, పందేల నిర్వహకులు కొంత మొత్తాలను వసూలు చేసి పోలీసులకు మామూళ్ల రూపంలో ముట్టచెబుతున్నారన్న విమర్శలు ఉన్నా యి. కూటమి ప్రభుత్వం ఒక వైపు పందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూనే మరో వైపు పూర్తి స్వేచ్ఛ నివ్వడంతో ఈసారి పండుగ సరికొత్తగా ఉరకలెత్తుతోంది. కూటమి ప్రభుత్వం కల్పించిన స్వేచ్ఛ కారణంగా అనేకమంది పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు.
రూ. వేలల్లో ఎంట్రీ ఫీజు
గ్రామాల్లో జరుగుతున్న కోడిపందెం, జూద శాలలు స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే సాగుతున్నట్లు సమాచారం. ఆటల నిర్వహణకు ఫీజు రూపంలో వసూళ్లు చేపడుతూ లక్షల రూపాయలను సంపాదిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆ టల్లో పాల్గొనే ఒక్కొక్కరు వెయ్యి నుంచి రూ.5 వేల వ రకు ఎంట్రీ ఫీజు రూపంలో చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఇ లా సేకరించిన మొత్తం నుంచి పోలీసులు, ఎకై ్సజ్ పో లీసులతో పాటు స్థానికంగా ఉన్న బడా నేతలకు కొంత మొత్తాలలో వెళుతుందన్నది బహిరంగ రహస్యం.
కాయ్ రాజా.. కాయ్..
కోడి పందేలతో పాటు ఎక్కడెక్కడ నుంచో వచ్చిన బంధువులు, మిత్రులు చిన్నాపెద్దా తేడా లేకుండా కాయ్‌రాజా కాయ్, పేకాట తదితర ఆటలు ప్రత్యక్షమయ్యాయి. ఇక మద్యం అయితే ఏరులై పారుతోంది. వచ్చిన బంధువులు, మిత్రుల కోసం స్థానికంగా ఉన్న వారు వారి స్థాయిని బట్టి మాంసాలను, పిండి వంటలను వండి వారికి రుచికరమైన ఆహారంగా అందిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయం ద్వారా మూడు రోజుల్లోనే రూ.10 కోట్ల వ్యాపారాన్ని చేసుకున్న ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా రెండింతలు వ్యాపారాన్ని చేసుకునే ప్రయత్నాలకు తెగబడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక గ్రామాల్లో ప్రభుత్వం అందిస్తున్న మద్యంతో పాటు స్థానికంగా ఉన్న కొంతమంది నాటు సారా బట్టీల ద్వారా తయారు చేసిన నాటు సారా కూడా అధికంగా అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాటిని నివారించేందుకు చర్యలు చేపట్టాల్సిన ఎకై ్సజ్ శాఖ మామూళ్లు మత్తులోమునిగిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. పట్టణాల నుంచి పల్లెలకు చేరుకున్న యువకులు పేకాట, కోడి పందెం, ఇతర వ్యవహారాల ద్వారా లక్షలాది రూపాయలను చేజార్చుకుని ఖాళీ చేతులతో తిరుగు ప్రయాణం కాయమని స్థానికంగా ఉన్న పలువురు పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు.
రాయచోటి : రాయచోటి పట్టణ సమీపంలో ఉన్న క్రషర్ స్థలాన్ని అధికార పార్టికి చెందిన నాయకులు ఆక్రమించి దౌర్జన్యంగా కోడిపందెం ఆటను నిర్వస్తున్నట్లు క్రషర్ నిర్వాహకుడు శ్రీనివాసులు వాపోతున్నారు. పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న దూళ్లవారిపల్లె సమీపంలో ఈ క్రషర్ ఉంది. రెండు రోజులుగా ఈ ప్రాంతాన్ని దౌర్జన్యంగా ఆక్రమించి విచ్చలవిడిగా కోడిపందేలు నిర్వహిస్తున్నారని, వద్దని చెబితే తనను చంపుతామని అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారన్నారు. సోమవారం పందెం జరుగుతున్న విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా తెలియపరిస్తే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని సూచించారన్నారు. పోలీసులు మాత్రం స్పందించడం లేదని అంటున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని మీడియా ముందు శ్రీనివాసులు వాపోయారు. తాను అణగారిన వర్గానికి చెందిన వ్యక్తినని, తన క్రషర్ ప్రాంతం కూడా కోర్టులోఉందన్నారు. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కోడిపందెం సాగిస్తున్నట్లు స్థానికులు మదనపడుతున్నారు.
ఊరూరా కోడిపందేలు
సంక్రాంతి నేపథ్యంలో
జోరందుకున్న జూదం
తాగినోళ్లకు తాగినంత మద్యం..
టీడీపీ నేతల కనుసన్నల్లో
సాగుతున్న వ్యవహారం
పండుగలు కావడంతో
ఎవరు పట్టించుకోరన్న ధీమా..
Comments
Please login to add a commentAdd a comment