మంటల్లో కాలి చనిపోయిన చెన్నారెడ్డి
మదనపల్లె : మడి నాటేందుకు సేకరించిన చెత్తను తగలబెడుతూ, ప్రమాదవశాత్తు అందులో పడి రైతు తీవ్రంగా కాలిపోయి మృతి చెందిన ఘటన మండలంలోని పోతపోలు పంచాయతీ కొంకిరెడ్డిపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన కె.చెన్నారెడ్డికి భార్య గంగులమ్మ, కుమారుడు సురేంద్రరెడ్డి, కుమార్తె ఉన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో చెన్నారెడ్డి వరి మడి నాటేందుకు పొలాన్ని చదునుచేసే క్రమంలో చెత్తను ఒకచోట కుప్పగా పోగు చేశాడు. కుప్ప తగులబెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడ్డాడు. వయోభారంతో లేవలేక మంటల్లోనే కాలిపోయాడు. గుర్తించిన స్థానికులు అతడిని మంటల నుంచి బయటకు తీసేలోపు మృతి చెందాడు. సంక్రాంతి పండుగ వేళ రైతు అగ్నికి ఆహుతి కావడంతో గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.
వ్యక్తిపై కత్తితో దాడి
సంబేపల్లె : మండలంలోని నారాయణరెడ్డిపల్లెకు చెందిన గజేంద్రనాయుడుపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. దీంతో గాయపడిన వ్యక్తిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ దాడికి సంబంధించిన వివరాలు తెలియాల్సిఉంది.
కోడిపందెం రాయుళ్ల అరెస్టు
రైల్వేకోడూరు : రైల్వేకోడూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో కోడిపందేలు నిర్వహిస్తున్న ఆరుగురిని ఆదివారం అరెస్టు చేసి రూ. 16,060 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ–2 వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలో కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment