హరిత దీపావళి.. ఆనందాల కేళి
రాజంపేట టౌన్ : దీపావళి వెలుగుల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనం. చీకటిని పారద్రోలి, జ్ఞానాన్ని పంచి జీవితంపై ఆశలు కల్పించే కాంతుల సందడి. అయితే అనేక మంది దీపావళిన పండగను కాలుష్య కారకంగా మార్చేస్తున్నారు. చెవులు బద్ధలయ్యే శబ్దాలు, ఊపిరితిత్తులు భరించలేని పొగలను విడుదల చేసే బాణ సంచాలను కాల్చడంతో తమ ఇబ్బందులను తామే కొని తెచ్చుకుంటున్నారు. దీపావళి రోజున టపాసులకు దూరంగా ఉండి కొన్నింటిని పాటిస్తే పర్యావరణ హితంగా జరుపుకోవచ్చని పలువురు చెబుతున్నారు.
బాణ సంచాలతో ఆరోగ్యానికి హానికరం
రకరకాల రసాయనాల మిశ్రమాలతో తయారుచేస్తున్న బాణ సంచాలు అనేక అనర్థాలకు దారి తీస్తున్నాయి. కాపర్, కాడ్మియం, లెడ్, అమ్మోనియం, నైట్రోజన్ ఆకై ్సడ్, సల్ఫర్ డయాకై ్సడ్, సోడియం మిశ్రమాలు, మెర్క్యురీ, లిథియం, పొటాషియం లోహ మిశ్రమాలను బాణ సంచాల తయారీలో వినియోగిస్తారు. వీటిని కాల్చడంతో ఊపిరితిత్తులు, చర్మం, కళ్లకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. అలాగే క్యాన్సర్, గుండె జబ్బులు, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. శబ్దాలు, ఘాటు వాసనలతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇలా జరుపుకొందాం
దీపావళి రోజున తల్లిదండ్రులు తమ పిల్లలకు టపాసులకు బదులు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వాలి. టపాసులు కాల్చితే కలిగే నష్టాలను వివరించి అవకాశం ఉన్న చోట ఒక మొక్క నాటించి దానిని పెంచి పెద్దచేసేలా తల్లిదండ్రులు పిల్లలను సమాయత్తం చేయాలి. దీపావళికి రెండు, మూడు రోజుల ముందు నుంచి పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులను బృందాలుగా ఏర్పాటు చేసి హరిత దీపావళిపై అవగాహన కల్పించి వారిలో చైతన్యం నింపాలి. అలాగే దీపావళికి ముందురోజు కొంత మంది విద్యార్థులను జట్టుగా చేసి వారిచే పాఠశాల ఆవరణలో మొక్క నాటించి వాటిని సంరక్షించే బాధ్యతను ఆ విద్యార్థులకే అప్పజెప్పాలి. ప్రతి ఏడాది దీనిని ఓ సంప్రదాయంగా చేపట్టేలా విద్యార్థుల్లో స్ఫూర్తిన నింపాలి. ఎట్టి పరిస్థితుల్లో టపాసులు కాల్చకూడదని, దీపాలు వెలిగించి, మొక్కలు నాటి దీపావళి జరుపుకొనేలా విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేసినప్పుడే హరిత దీపావళి సాధ్యం కాగలదని విద్యావంతులు చెబుతున్నారు.
పండగ వేళ జరభద్రం..!
మదనపల్లె సిటీ : కుటుంబంమంతా సందడిగా జరుపుకొనే పండగ వేళ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మదనపల్లె ఫైర్ ఆఫీసర్ శివప్ప కోరారు. అగ్నిప్రమాదాలు జరిగిన వెంటనే 101 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. ప్రమాదాలు జరిగిన వెంటనే సమీప ఫైర్ స్టేషన్లకు సంబంధించిన కింది నెంబర్లకు ఫోన్ చేయవచ్చునన్నారు.
మా వాటా మాకివ్వాల్సిందే!
గాలివీడు: తమ వాటా ఇవ్వాల్సిందేనని అధికారులు ఒత్తిడిచేయడంతో టపాసుల దుకాణదారులు తలలు పట్టుకొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రెండు రకాల పన్నులు చెల్లించి దుకాణదారులు బాణ సంచా తీసుకువస్తున్నారు. దీనికి రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, పంచాయతీ శాఖ అధికారులు అనుమతులు తీసుకోవాలి. ఇందుకు లైసెన్స్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. వివిధ శాఖల అధికారులు ప్రతి దుకాణం నుంచి రూ.5 వేలు ఇవ్వాలని పట్టు పడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇతర శాఖలతో మాకు సంభంధం లేదు.. మా సార్ చెప్పారు టపాసుల ప్యాకేజీ ఇవ్వాల్సిందేనంటూ చెప్పి దొరికినన్ని పట్టుకెళ్లడం పరిపాటిగా మారిపోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. జిల్లా స్థాయి అధికారులు చొరవచూపి బలవంతపు వసూళ్లను కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని దుకాణదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పండగలన్నీ ప్రస్తుతం ట్రెండ్లీగా మారిపోయాయి. దీపావళి పండగ అంటేనే పర్యావరణానికి హాని చేసేదిగా మారిపోయింది. పెద్ద శబ్దాలతో క్రాకర్స్ కాల్చడం.. ఘాటైన రసాయన పదార్ధాలతో తయారు చేసిన టపాసులను కాల్చడంతో పర్యావరణానికి తీరని నష్టం కలగడమేగాక, శబ్ధ కాలుష్యం, వాయు కాలుష్యం పెరిగిపోతోంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రకృతి హితంగా దీపావళి జరుపుకొందాం.. మన పర్యావరణాన్ని కాపాడుకుందాం.
టపాసుల బదులు మొక్కను
నాటుదామంటున్న విద్యావంతులు
పాఠశాలల్లో అవగాహన కల్పించాలని కోరుతున్న తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment