సమగ్ర వ్యవసాయ పథకం అమలుపై దృష్టి సారించాలి
రాయచోటి : జిల్లాలో సమగ్ర వ్యవసాయ పథకం అమలుపై రైతులు దృష్టి సారించేలా అవగాహన సదస్సులను నిర్వహించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి చంద్రనాయక్ సూచించారు. గురువారం రాయచోటిలోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో సహాయ వ్యవసాయ సంచాలకులు, అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో చంద్రనాయక్ మాట్లాడారు. వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం (ఆర్‌ఏడీ–2024–25) కింద సమగ్ర వ్యవసాయ వ్యవస్థ అమలు చేయు విధానంపై తెలిపారు. ఈ పథకంలో భాగంగా జిల్లాలో 16 మండలాలు ఎంపికయ్యాయన్నారు. ఆయా మండలాల్లోని 400 మంది రైతులను లక్ష్యంగా చేసుకొని పథకం అమలుపై దృష్టి సారించాలన్నారు. ప్రధానంగా సమగ్ర వ్యవసాయ వ్యవస్థ, ఇతర విభాగాల కింద సైలెజ్ యూనిట్, వర్మీ కంపోస్ట్ యూనిట్‌లను నిర్మించుకోవాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ కింద వ్యవసాయ పంటలైన రాగులు, కొర్రలు, నూనె గింజలు, ఉద్యాన పంటలలో మామిడి, అల్లనేరేడు, జామ సాగు చేయాలన్నారు. అలాగే ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు పెంచుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఎంపిక చేసిన 16 మండలాల వ్యవసాయ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి పథకంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు మజీద్ అహ్మద్, టెక్నికల్ వ్యవసాయ అధికారి రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment