కళాకారుడి హత్యకేసును నీరుగారుస్తున్న పోలీసులు
రాయచోటి అర్బన్ : గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లె వద్ద ఈనెల 23న జరిగిన మల్లెల వెంకటరమణ ( 25) అనే కళాకారుడి హత్యకేసును లక్కిరెడ్డిపల్లె సీఐ కొండారెడ్డి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆరోపించారు. ఈ హత్య సంఘటనపై బుధవారం ఓపీడీఆర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.ఈశ్వర్ నేతృత్వంలో పలు సంఘాల నేతలు నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడ్డారు. సంఘటన స్థలాన్ని సందర్శించి స్థానికులను, పోలీసులను విచారించారు. సీఐ కొండారెడ్డి కేసును సరైన పద్ధతిలో విచారణ చేయడం లేదని డీఎస్పీ క్రిష్ణమోహన్‌కు వివరించారు. అనంతరం రాయచోటిలోని డీఎస్పీ కార్యాలయం ఎదుట ఓపీడీఆర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.ఈశ్వర్ విలేకరులతో మాట్లాడారు. మృతుడి సోదరుడు మల్లెల ఆంజనేయులు జరిగిన సంఘటన గురించి వివరిస్తున్నప్పటికీ సీఐ కొండారెడ్డి అతని మాటలు వినకుండా సెల్‌ఫోన్ లాక్కుని పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టుకున్నారని తెలిపారు. రమణారెడ్డితో పాటు అతని కుమారులు శివారెడ్డి ( 30), రామాంజులురెడ్డి (25) కూడా నేరంలో పాల్గొన్నారని హతుడి సోదరుడు చెబుతున్నప్పటికీ సీఐ కొండారెడ్డి మాత్రం ఒక్క రమణారెడ్డి పేరును మాత్రమే ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం కేసును నీరుగార్చడమే అవుతుందన్నారు. నేరం రుజువు చేసేందుకు నేర స్థలంలో రక్తపు మరకలతో ఉన్న 4 రాళ్లు ప్రధాన భూమిక పోషిస్తాయని, అలాంటి రాళ్లను పోలీసు ప్రొసీడింగ్స్ ప్రకారం ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు. సీఐ కొండారెడ్డిని విచారణ బాధ్యతల నుంచి తప్పించి మరొక నిజాయితీ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. నిజనిర్ధారణ కమిటీలో సభ్యులుగా రజక సంఘం నాయకులు రమేష్, శ్రీనివాసులు, వడ్డెర విద్యావంతుల వేదిక తరపున చంద్రశేఖర్, మారుతి శంకర్, అలాగే జీవానందం, కోటకొండ రవిశంకర్, భోగేశ్వర్, బండల శ్రీను, శ్రీరాములు ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డెయ్య తదితరులు ఉన్నారు.
నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల ఆరోపణ
Comments
Please login to add a commentAdd a comment