చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
రాయచోటి అర్బన్: అన్నమయ్య జిల్లాను చెత్త రహిత జిల్లాగా తీర్చిదిద్ది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర –స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి స్ధానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. మన ఇంటిని, మన పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడమే మనం సమాజానికి అందిస్తున్న సేవ అన్నారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయితీలలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో పరిశుభ్రత కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు.
● జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ ఇక నుంచి నెలలో మూడవ శనివారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రహదారుల పక్కన, కాలువలు, చెరువులు, కుంటల వద్ద శ్రమదానం చేసి చెత్తాచెదారాలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి జిల్లాను చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం చీపురు చేత పట్టుకుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పరిసరాలను శుభ్రం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మానవహారం నిర్వహించి ప్రజలచే స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాసుబాబు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
సుండుపల్లె: మండల పరిధిలోని మడితాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ హాజరయ్యారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ మస్తాన్ వలీ, ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిది
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
Comments
Please login to add a commentAdd a comment