హార్సిలీహిల్స్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
ఏపీ టీడీసీ చైర్మన్ బాలాజీ
బి.కొత్తకోట: నిర్వహణలో రాష్ట్రంలోనే ఉత్తమ యూనిట్‌గా నిలిచిన హార్సిలీహిల్స్ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక అమలు చేస్తామని పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. శనివారం ఆయన హార్సిలీహిల్స్ పై పర్యాటకశాఖ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. అతిథి గృహాల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులు పరిశీలించి బార్, రెస్టారెంట్ నిర్వహణ, వాటి విస్తరణ పనులపై సమీక్షించారు. రూ.10 కోట్లతో ప్రస్తుతం జరుగుతున్న పనులపై ఆయన తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. పనుల్లో ఐదు శాతం కూడా పూర్తి చేయించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే పర్యాటకశాఖకు ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే భారీ ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. యాత్రి నివాస్ వద్ద నిర్మాణ పనులు చేపట్టవద్దని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ స్థలంలో కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కేటాయించాలని సూచించారు. రెవెన్యూ అతిథి గృహాన్ని టూరిజంకు అప్పగించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పట్టు శాఖ భవనాలను సద్వినియోగం చేసుకుంటే మరింత ఆదాయం వస్తుందని మేనేజర్ నేదురుమల్లి సాల్విన్ రెడ్డి ఆయన దృష్టికి తెచ్చారు.
అధికారుల తీరుతో పర్యాటకశాఖ నాశనం
అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ నాశనమైందని నూకసాని బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్సిలీహిల్స్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోర్డుకు తెలియకుండా యూనిట్లను ప్రైవేటుకు ఇస్తామని స్టెర్లింగ్ సంస్థను పర్యాటక కేంద్రాల్లో ఎవరు తిప్పుతున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేపడితే.. సంస్థకు నష్టం జరగాలని పనులు పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని అన్నారు. పర్యాటకశాఖకు టీటీడీ కేటాయించిన వెయ్యి దర్శన టికెట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకించారు.
చైర్మన్ దృష్టికి సాక్షి కథనం
హార్సిలీహిల్స్‌ను ప్రైవేటుకు ఇచ్చే ప్రయత్నాలపై సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని టూరిజం సిబ్బంది బాలాజీ దృష్టికి తెచ్చారు. స్పందించిన బాలాజీ ఉద్యోగులు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారు, మంచి ఆదాయం వస్తోంది. ఇలాంటి యూనిట్ ప్రైవేట్‌కు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment