‘ఆల్విన్‌’ కథ.. ఇక అంతేనా..! | - | Sakshi
Sakshi News home page

‘ఆల్విన్‌’ కథ.. ఇక అంతేనా..!

Published Sun, Jan 19 2025 1:55 AM | Last Updated on Sun, Jan 19 2025 1:55 AM

‘ఆల్వ

‘ఆల్విన్‌’ కథ.. ఇక అంతేనా..!

రాయలసీమకే తలమానికంగా నిలిచిన ఆల్విన్‌ రిఫ్రిజిరేటర్ల కర్మాగారానికి గ్రహణం పట్టింది. ఆది నుంచి ఆటంకాలు ఎదుర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రైవేటు సంస్థలైన ఓల్టాస్‌, ఎలక్ట్రోలెక్స్‌ చేతుల్లోకి మారి చివరికి మూతపడింది. పర్యవసానంగా జిల్లాలో భారీ పరిశ్రమ ఉన్నా.. లేనట్టుగానే మారింది.

రాజంపేట : అన్నమయ్య జిల్లాలో నందలూరు సమీపంలో వెలసియున్న ఆల్విన్‌ రిఫ్రిజిరేటర్ల కర్మాగారానికి 1987 ఏప్రిల్‌ 3న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శుంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కర్మాగారం ప్రారంభోత్సవానికి మొదటి నుంచి ఆటంకాలు ఎదురవుతూనే వచ్చాయి. 1987 మార్చి 27న జరగాల్సి ఉండగా ఏప్రిల్‌ 3కి వాయిదా పడింది. అనంతరం కేవలం 15 నెలల్లో నిర్మాణం పూర్తి అవుతుందని భావించగా.. ఏడాది కాలం టెండర్లతోనే గడిచిపోయింది. నిర్మాణం పూర్తయై 1989 నవంబరులో ఆనాటి సీఎం ఎన్‌టీఆర్‌ ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంది. అప్పట్లో ఎన్నికలు రావడంతో పరిస్థితి తారుమారైంది. 1990లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డితో మార్చిలో ఒక సారి ప్రయత్నం చేశారు. ఇలా ప్రారంభోత్సవానికి పురిటి కష్టాలు పడింది.

చేతులు మారుతూ.. ప్రైవేటు పరం దిశగా..

నందలూరు ఆల్విన్‌ కర్మాగారాన్ని 1992లో ప్రైవేటుపరం చేస్తామని ప్రకటించారు. అప్పట్లో ఆల్విన్‌లో 700 మంది కార్మికులు, 150 మంది హెల్పర్లు, 60 మంది ఇంజినీర్లు, సూపర్‌వైజర్లు 1200 మంది ఉన్నారు. హైదరాబాద్‌ ఆల్విన్‌కు రెండేళ్లుగా నష్టం సంభవించడంతో అక్కడి నుంచి నందలూరుకు ముడిసరుకుల రవాణా ఆగిపోయింది. 2001లో ఉత్పత్తి ఆగిపోయింది. రెండేళ్లు కార్మికులను కూర్చోబెట్టి జీతాలు ఇచ్చారు. 2003లో కార్మికులకు వీఆర్‌ఎస్‌ ఇచ్చారు.

21 ఏళ్లుగా తెరుచుకోని..

నందలూరు ఆల్విన్‌ మూతపడి 21 ఏళ్లయినా తెరుచుకోని పరిస్థితి. ప్రభుత్వాలు, పాలకులు భారీ పరిశ్రమను మల్టీనేషనల్‌ కంపెనీలకు ఇవ్వడం.. వారు నష్టాల సాకుతో అమ్మివేయడం.. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఓ బిల్డరు తీసుకోవడం జరిగింది. భూములు, క్వార్టర్స్‌, భవనాలు నిరుపయోగంగా మారాయి. జిల్లాకు చెందిన పలువురు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చినా.. బిల్డరు చెప్పే రేటుకు ఒప్పుకోక, అలాగే వాస్తు సరిగ్గా లేదనే భావనతో కొంత వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికై నా భారీ పరిశ్రమ దిశగా పెద్ద సంస్థలు ముందుకొస్తేనే ఆల్విన్‌ కర్మాగారానికి పూర్వవైభవం సంతరించుకుంటుందని నిరుద్యోగులు భావిస్తున్నారు. అంతేగాకుండా ఆల్విన్‌ ఫ్యాక్టరీని పరిశ్రమల చట్టం ప్రకారం ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్‌ను ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు. నవ్యాంధ్రలో జిల్లా వరకు భారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే నందలూరు ఆల్విన్‌ ఫ్యాక్టరీ అనుకూలమనే ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పాలకులదే.

‘కల’గానే ప్రభుత్వ పరిశ్రమ

నిరుద్యోగుల ఎదురుచూపులు

21 ఏళ్లయినా తెరుచుకోని ఫ్యాక్టరీ

కూటమి దృష్టి సారించాలంటున్న జనం

No comments yet. Be the first to comment!
Add a comment
‘ఆల్విన్‌’ కథ.. ఇక అంతేనా..!1
1/1

‘ఆల్విన్‌’ కథ.. ఇక అంతేనా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement