సీఎం సాక్షిగా బయటపడిన విభేదాలు
రాయచోటి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షిగా రాయచోటిలో టీడీపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో కొన్ని నెలలుగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగవాసి కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు రాయచోటి నియోజకవర్గం పర్యటనకు వచ్చినా టీడీపీలో సీనియర్ నాయకుడిగా చెప్పుకునే సుగవాసి పాలకొండ్రాయుడు చిన్న కుమారుడు ప్రసాద్‌బాబు హాజరు కాలేదు.సీఎం పర్యటన ఆహ్వాన సమాచారం ప్రసాద్‌బాబుకు అందలేదన్న వార్తలు సోషల్ మీడియా, వాట్సప్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి. పార్టీ ప్రారంభం నుంచి పనిచేస్తున్న కుటుంబానికి ముఖ్యమంత్రి పర్యటన ఆహ్వానం ఇవ్వకపోవడంపై టీడీపీలోని నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. పాలకొండ్రాయుడు పెద్దకుమారుడు, రాజంపేట నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి సుబ్రమణ్యంకు హెలిప్యాడ్ దగ్గరకు ఆహ్వానం ఉన్నా ఆయన కూడా అక్కడికి వెళ్లకుండా సంబేపల్లి మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ దగ్గర ముఖ్యమంత్రితో చేతులు కలిపి అక్కడ నుంచి నేరుగా రాయచోటికి తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల మధ్య తలెత్తిన వివాదం ఎటు దారితీస్తుందోనన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఇప్పటికే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపైన రాజంపేట పార్టీ ఇన్‌చార్జి సుబ్రమణ్యం ప్రజా వేదికల మీదనే తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. రాయచోటిలో పార్టీలో సీనియర్ నేతగా పనిచేస్తున్న ప్రసాద్ బాబుకు శనివారం ముఖ్యమంత్రి పర్యటన ఆహ్వాన సమాచారం లేకపోవడంపై పార్టీలో పెద్దచర్చకు దారితీసింది.
రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు
రాజకీయంగా తనను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ప్రసాద్ బాబు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటనకు రాకపోవడంపై సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులలో రకరకాల కథనాలు వెలువడటంతో తాను స్పందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి విడుదలైన పేర్ల జాబితాలో హెలిప్యాడ్, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, గ్రామసభ ప్రాంగణాలలో ప్రకటించిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారుల జాబితాలో తన పేరును చేర్చలేదన్నారు. 64 మంది, 30 మంది జాబితాల ప్రకటనలో తన పేరును లేకుండా చేసిన వారెవ్వరో తనకు తెలుసు అన్నారు. పర్యటన సందర్భంగా జరిగిన విషయాలను పార్టీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్తానన్నారు. త్వరలో తనను వచ్చి కలవాలని అధ్యక్షుడు సూచించారన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేష్ ల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తనను పార్టీ నుంచి ఎవరూ దూరం చేయలేరని ప్రసాద్ బాబు మీడియా ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఒక సందేశ్నాని ఇచ్చారు. పార్టీ అభిమానులు, నాయకులు నేడు జరిగిన సంఘటనపై ఎలాంటి పోస్టులు పెట్టరాదని ప్రసాద్ బాబు విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా సుగవాసి
Comments
Please login to add a commentAdd a comment