కేజీబీవీ ఎస్వో సస్పెన్షన్
పెద్దతిప్పసముద్రం: స్థానిక అంకిరెడ్డిపల్లి రోడ్డులో ఉన్న కస్తూర్బా బాలికా విద్యాలయం(కేజీబీవీ) ఎస్వో శైలజను సస్పెండ్ చేసినట్లు డీఈఓ డాక్టర్ కె.సుబ్రమణ్యం శనివారం పేర్కొన్నారు. సమగ్ర శిక్షా పీఎం పోషణ్ సామాజిక తనిఖీ బృందం బహిర్గతం చేసిన విషయాల్లో ఎన్నో అక్రమాలు, బాలికల పట్ల వేధింపులు లాంటి ఎన్నో నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంపై ఈ నెల 26న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మా బిడ్డలకు ఏదీ రక్షణ’కథనంపై జిల్లా కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్వో శైలజను సస్పెండ్ చేస్తూ కస్తూర్బా కేజీబీవీకి ఉత్తర్వులు పంపినట్లు డీఈఓ వెల్ల డించారు.
జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ
లక్కిరెడ్డిపల్లి: సంయుక్త భారతీయ కేల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జైపూర్‌లో జనవరి 30, 31వ తేదీల్లో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో లక్కిరెడ్డిపల్లి మండలం మేడిమాకుల గుంతకు చెందిన కొర్లకుంట నాగరాజు ప్రతిభ కనబరిచాడు. 74 కిలోల విభాగంలో 450 కిలోల బరువు ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. ఫౌండేషన్ ప్రెసిడెంట్ పంకజ్ గౌడ్, జనరల్ సెక్రటరీ శివ తివారీ చేతుల మీదుగా పతకం అందుకున్నాడు. నాగరాజు పతకం సాధించడం పట్ల తల్లిదండ్రులు కొర్లకుంట రమణయ్య, రత్నమ్మ సంతోషం వ్యక్తం చేశారు. లక్కిరెడ్డిపల్లి ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, జెడ్పీటీసీ రమాదేవీ, మాజీ ఎంపీపీ అంబాబత్తిన రెడ్డయ్య నాగరాజుకు అభినందనలు తెలిపారు.
ట్రిపుల్ ఐటీలకు నిధుల కొరత
వేంపల్లె: రాష్ట్రంలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీలకు నిధుల కొరత ఉందని ఆర్జీయూకేటీ వైస్ చానన్స్‌లర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు నూతన భవనాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, కంప్యూటర్లు, మౌలిక వసతులు, మెస్సులు తదితర వాటికి రూ.300 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment