రాముని సేవలో హనుమ
కడప కల్చరల్: తన ప్రభువు, లోక పాలకుడు శ్రీరామచంద్రుడు కార్యర్థమై తనను సేవకుడిగా ఎంచుకున్నందుకు హనుమ పులకించిపోయాడు. ఆ సేవ అదృష్టంగా భావించి శ్రీరాముడికి వాహనమై స్వామి తరించాడు. కోదండపాణిగా రాముడు వనవిహారం చేసేందుకు సహకరించాడు. దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి ఉదయం కల్పవృక్ష వాహనంపై కొలువుదీరి మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. కల్పవృక్షం వాహనంపై స్వామి ఊరేగింపు ఏర్పాటు చేయడంతో తిలకించేందుకు భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. సాయంత్రం హనుమంత వాహనంపై కోదండరాముడిగా కొలువుదీరాడు. వేద పండితులు స్వామి అమ్మవార్ల మూల విరాట్లకు విశేష అలంకారం చేశారు. అనంతరం ఆలయం వెలుపలగల అలంకారం మండపంలో స్వామిని వాహనంపై ఆసీనులను చేశారు. సూర్యతేజోమయుడైన శ్రీ రామచంద్రుడు ధగధగలాడే రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులో మరింతగా మెరిసిపోతూ భక్తులను కరుణించాడు. పాతకడప, దేవునికడపలతోపాటు నగరానికి చెందిన భక్తులు స్వామి వెంట ఊరేగింపులో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment