ప్రొద్దుటూరు : మండలంలోని పెద్దశెట్టిపల్లెలో ఉన్న శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కళాశాల యాజమాన్యం తనను ఫీజు చెల్లించలేదని వేధిస్తోందని బి.ఫార్మసీ రెండో సంవత్సరం విద్యార్థిని యు.ప్రసన్న శనివారం ప్రొద్దుటూరు కోర్టు మండల లీగల్ సర్వీస్ అథారిటీకి ఫిర్యాదు చేసింది. కళాశాలలో చేర్చుకునేటప్పుడు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే చెల్లిస్తుందని కళాశాల యాజమాన్యం చెప్పిందని విద్యార్థిని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం ఫీజు చెల్లిస్తేనే పరీక్ష రాసేందుకు హాల్ టికెట్ ఇస్తామని వేధించారన్నారు. తమ తల్లిదండ్రులు అంత ఫీజు కట్టలేరని చెప్పినా వారు వినలేదని తెలిపారు. తోటి విద్యార్థుల ముందు కించపరిస్తూ దురుసుగా మాట్లాడుతూ తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదని కళాశాల యాజమాన్యం చెబుతోందని తెలిపారు. సోమవారం జరగనున్న పరీక్షలకు ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికప్పుడు ఇంత ఫీజు చెల్లించే స్తోమత తమ తల్లిదండ్రులకు లేదన్నారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని తనకు హాల్ టికెట్ ఇచ్చి పరీక్షలకు హాజరయ్యే విధంగా చేయాలని కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment