కల్తీ మద్యం ముఠా అరెస్టు
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రైల్వేకోడూరు, తిరుపతి తదితర ప్రాంతాలలో కల్తీ మద్యం విక్రయిస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి ఆ ధ్వర్యంలో శనివారం తొలుత అనంతరాజుపేటలో దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేశారు. రెండు వాహనాలు, 509 బాటిళ్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా అసలు గుట్టు రట్టయింది. వారిచ్చిన సమాచారం మేరకు తిరుపతి, కోడూరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 1641 మద్యం బాటిళ్లు, ఒక కారు, 7000 ఖాళీ సీసాలు, మూతలు, స్టిక్కర్లు, ప్రింటరు, లాప్‌టాప్, మిషనరీ, 8051 లీటర్ల స్పిరిట్ స్వాధీనం చేసుకుని మరో ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉందన్నారు. అరెస్టయిన వారిలో కోడూరుకు చెందిన అయ్యప్ప, ఓబులవారిపల్లికి చెందిన నారాయణరాజు, శివశంకర్, నరసింహా, తిరుపతికి చెందిన బాబు, చికెన్ శ్రీను, మహేశ్వర్, శివశంకర్ ఉన్నారన్నారు. అలాగే వీరికి స్పిరిట్, ఫ్లేవర్లు, బాటిళ్లు, స్టిక్కర్లు సరఫరా చేసిన నిందితులు హైదరాబాద్‌కు చెందిన చరణ్‌జ్యోత్‌సింగ్, అక్షయ్‌లను అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ దాడిలో సీఐలు ఎల్లయ్య, తులసీ, నీలకంఠారెడ్డి, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
చెలరేగిన ఆంధ్రా బ్యాట్స్‌మన్
– రెండో మ్యాచ్‌లో భారీస్కోరు దిశగా ఆంధ్రా జట్టు
కడప ఎడ్యుకేషన్ : కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో కల్నల్ సీకే నాయుడు అండర్–23 అంతర్ రాష్ట్రాల క్రికెట్ మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు బ్యాట్స్‌మన్ చెలరేగారు. శనివారం నిర్వహించిన మ్యాచ్‌లో హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రా జట్లు తలపడగా ఆంధ్రా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఆంధ్రా జట్టు 360 పరుగులు చేసింది. జట్టులోని హేమంత్‌రెడ్డి 136 పరుగులు, వెంకటరాహుల్ 162 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హిమాచల్‌ప్రదేశ్ బౌలర్లు సాహిల్ శర్మ 2, నారాయణ 2 వికెట్లు తీశారు. దీంతో తొలిరోజు ఆట ముగిసింది.
ఆటోను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
– ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు
వేంపల్లె : వీరపునాయునిపల్లి మండలం నేలతిమ్మయ్యగారిపల్లె గ్రామ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొంది. ముకుంద ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాదు నుంచి వేంపల్లెకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేంపల్లె పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన కూలీలు ఆటోలో ఎరగ్రుంట్లకు వెళుతుండగా నేలతిమ్మయ్యగారిపల్లె గ్రామ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి వస్తున్న ముకుంద ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు, శ్రీనివాసులు, అంజనమ్మ, లక్ష్మయ్య, వీరయ్య, రమణమ్మ, చిన్న రాయుడులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనం ద్వారా వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీరయ్య (57)మృతి చెందాడు. ఆంజనేయులు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కడప రిమ్స్‌కు తరలించారు. సంఘటన స్థలాన్ని వీరపునాయునిపల్లె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment