కబ్జా కోరల్లో ఈద్గా స్థలం !
రైల్వేకోడూరు అర్బన్ : అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరావారిపల్లి పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 2085లో రూ.10 కోట్లు విలువ చేసే 17 ఎకరాలు స్వాహా చేసేందుకు కొందరు జనసేన నాయకులు పావులు కదుపుతున్నారు. ఇందుకు ఆ పార్టీలో రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పే నాయకుడి సహకారం పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 17 ఎకరాల్లో ముస్లిం మైనార్టీల ప్రార్థనలకు కేటాయించిన 4 ఎకరాల 25 సెంట్ల ఈద్గా భూమిపై గ్రామ పంచాయితీ తరపున స్టే ఉందని, కనుక ముస్లిం మైనార్టీల ప్రార్థనలకు కేటాయించిన స్థలం రద్దు చేసి గ్రామ అవసరాలకు కేటాయించేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు స్థానిక జనసేన సర్పంచ్ లేఖ రాశారు. దీని వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. కొందరు నాయకులు ఈ భూమిని అప్పగిస్తామని పలువురి వద్ద రూ. లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ భూమిలో మట్టి తోలి ఆక్రమణకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈద్గా స్థలం కేటాయింపు..
రైల్వేకోడూరులో ముస్లింలు 12 వేలమందికి పైగా ఉన్నారు. వీరంతా పండుగ సమయాల్లో ప్రార్థనలు చేసుకునేందుకు ఇబ్బందులు పడేవారు. ఎన్నో సంవత్సరాలుగా ఈద్గా స్థలం సరిపోక జాతీయ రహదారిపై ఎండలో ప్రార్థనలు చేసేవారు. వారి సమస్య గుర్తించిన అప్పటి ఎంపీ, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మైసూరావారిపల్లి వద్ద ప్రత్యేకంగా 4 ఎకరాల 25 సెంట్ల భూమిని కేటాయించారు. అక్కడ ఈద్గా నిర్మాణం చేపట్టి గత మూడు సంవత్సరాలుగా వేలాది మంది ముస్లింలు పండుగల సమయంలో ప్రార్థనలు చేస్తున్నారు.
కూటమిలో భిన్నాభిప్రాయాలు
భూ బాగోతం విషయమై కూటమిలోని టీడీపీ, జనసేనలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జనసేనలోని ఒక వర్గం నాయకులు కబ్జాయత్నాలను బహిరంగంగానే విమర్శిస్తూ సోషియల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అలాగే కొందరు ముస్లిం నాయకులు ఈ విషయాన్ని టీడీపీ ఇన్‌చార్జి ముక్కా రూపానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా పూర్తి స్థాయిలో సర్వే జరిపి తప్పని సరిగా ఆ స్థలాన్ని ముస్లింలకు కేటాయిస్తామని చెప్పినట్లు తెలిసింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
ఈద్గాకు స్థలం కేటాయింపు
రూ.కోట్లు విలువ చేసే భూమి కబ్జాకు కూటమి నేతల యత్నాలు
ప్రార్థనా స్థలం కాపాడుకుంటాం
నియోజకవర్గంలో కూటమి నాయకుల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. 15 సంవత్సరాలుగా ముస్లింలు రోడ్డుపైనే ప్రార్థనలు చేస్తుంటే వారు పడుతున్న బాధలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారికి ఈద్గా స్థలం కేటాయించాం. వారికి కేటాయించిన భూమి అన్యాక్రాంతమైతే ఉరుకోము. ఆందోళనలు చేపడతాం. నియోజకవర్గంలో అన్ని మతాల సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరికీ స్థలాలు, నిధులు కేటాయించాం. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు వాటిని అభివృద్ధి చేయాల్సింది పోయి విధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదు.
– కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి
ఇలాంటివి ప్రోత్సహించడం సబబుకాదు
ప్రార్థనా స్థలాల జోలికి రావడం సబబుకాదు. ఇలాంటి విషయాలను కూటమి పెద్ద నాయకులు ప్రోత్సహించడం సరికాదు. తక్షణమే వాటికి అడ్డుకట్ట వేయాలి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో స్థలం కేటాయించేందుకు ఎంతగానో కృషి చేశాం. – వైఎస్ అన్వర్‌బాషా,
జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు, రైల్వేకోడూరు.
Comments
Please login to add a commentAdd a comment