రైతులు బీమాపై అవగాహన కల్పించుకోవాలి
యద్దనపూడి: రైతులు బీమా పథకాల పట్ల అవగాహన కల్పించుకొని తమ పంటలను బీమా చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి రామకృష్ణ అన్నారు. మార్టూరు, పర్చూరు, అద్దంకి సబ్ డివిజన్ పరిధిలోని 10 మండలాలకు సంబంధించి వ్యవసాయ సిబ్బందికి గురువారం మార్టూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి పాల్గొని రబీ పంటల బీమా పథకం గురించి వివరించారు. గ్రామాల్లో రైతు సోదరులకు పథకంపై అవగాహన కల్పించి రైతులందరిని ఈ పథకంలో నమోదు చేసుకునేలా చేయాలని రైతుసేవా కేంద్ర సిబ్బందిని ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉప్పు నీటి పరిశోధన స్థానం, బాపట్ల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పీ మధువాణి పాల్గొని భూసార పరిరక్షణ, సమస్యాత్మక నేలల యాజమాన్యం గురించి విపులంగా సిబ్బందికి తెలియజేశారు. జిల్లా వనరుల కేంద్రం బాపట్ల డిప్యూటీ డైరక్టర్ ఎం విజయనిర్మల రబీ పంటపై వ్యవసాయ సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం బాపట్ల సహాయ వ్యవసాయ సంచాలకులు టీ రత్నకుమారి, మార్టూరు సహాయ వ్యవసాయ సంచాలకులు కేవీ శ్రీనివాసరావు, అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకులు కే ధనరాజ్, మండలాల వ్యవసాయ అధికారులు, వీఏఏ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి రామకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment