సురక్ష బీమా.. కుటుంబానికి ధీమా
కొరిటెపాడు (గుంటూరు): కేంద్ర ప్రభుత్వం పలు బీమా పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) ఒకటి. ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తుంది. 18 – 70 సంవత్సరాల మధ్య వయస్సు వారు బీమాకు అర్హులు. బ్యాంకు ఖాతా ఉంటే అధికారులను కలిసి వివరాలు తెలుసుకోవచ్చు. ఆటో డెబిట్ ఫెసిలిటీ యాక్టివేట్ చేసుకోవాలి. అకౌంట్ నుంచి ప్రతి సంవత్సరం మే నెల చివరిలో రూ.20 నేరుగా కట్ అవుతాయి. అందువల్ల ఖాతాదారుడు ఆ నెలలో అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్‌తోపాటు అదనంగా రూ.20 కచ్చితంగా ఉంచాలి. ప్రమాదవశాత్తు మరణించినా, పూర్తి అంగవైకల్యం పొందినా రూ.2 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.లక్ష వరకు నామినీకి అందిస్తారు. గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఫోను నంబరు, నామినీ వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజీజీవై) పథకాన్ని కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. ఇందులో రూ.436 వార్షిక ప్రీమియంతో అన్ని రకాల మరణాలకు రూ.2 లక్షల కవరేజీ ఇస్తారు. 18 – 50 ఏళ్ల వయస్సు మధ్య వారు ఈ బీమా పొందవచ్చు. ఈ బీమా అన్ని బ్యాంకులు, తపాలా కార్యాలయాల నుంచి తీసుకోవచ్చు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
బీమా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. పీఎంఎస్‌బీవై, పీఎంజీజీవైలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాం. నిరుపేదలకు ఇవి చాలా ఉపయోగకరం. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే కుటుంబానికి ఆర్థిక భరోసా కలుగుతుంది. పూర్తి అంగవైకల్యం కలిగినా ఒప్పందం ప్రకారం బీమా మొత్తం చెల్లిస్తారు.
– మహిపాల్‌రెడ్డి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్
పాలసీని ప్రతిష్టాత్మకంగా తెచ్చిన కేంద్రం బ్యాంక్ ఖాతా ఉంటే చాలు తీసుకోవడం తేలిక ప్రీమియం ఏడాదికి రూ.20 మాత్రమే
Comments
Please login to add a commentAdd a comment