క్రీడాపోటీలతో ఉద్యోగుల్లో నూతనోత్సాహం
లక్ష్మీపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలతో వారిలో నూతనోత్సాహం కలుగుతుందని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయ ప్రాంగణంలో గురువారం రెండో విడత డీఆర్‌ఎం కప్ క్రీడా పోటీలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్రీడాస్ఫూర్తిని పెంచేందుకు, నైపుణ్యం వెలికి తీసేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు. కప్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. మహిళా ఉద్యోగులను భాగస్వాముల్ని చేయాలని సూచించారు. దీనికి డీఆర్‌ఎం స్పందించి మరుక్షణమే ఆ సూచన అమలుకు చర్యలు చేపట్టారు. తర్వాత డీఆర్‌ఎం మాట్లాడుతూ... శనివారం నుంచి పోటీలు ఉంటాయని తెలిపారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నంద్యాల, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటారని వివరించారు. ప్రైవేట్ రిజిస్టర్డ్ సంస్థల వారికీ అవకాశం కల్పించామన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి , జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి శివహర్ష, డీఆర్‌ఎం రామకృష్ణలు ఈ సందర్భంగా కాసేపు బాస్కెట్ బాల్ ఆడారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం కె.సైమన్, సీపీఎం గుంటూరు మనోహర్‌రెడ్డి, డివిజన్ క్రీడాధికారి ఎం.దినేష్‌కుమార్, సీనియర్ డీపీఓ షహబాజ్ హనూర్, డీసీఎం కమలాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
యార్డుకు 46,017 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 46,017 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 44,282 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ. 15,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి 16,500 వరకు లభించింది. ఏసీ కామన్ రకం మిర్చి రూ. 8,000 నుంచి రూ. 14,000 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ. 7,500 నుంచి రూ. 16,500 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.11,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 37,373 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వి.ఆంజనేయులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment