బడిలో గంటశోష!
● పెరిగిన గంట పని భారం
● సాయంత్రం 5 గంటల
వరకు పాఠశాలలు
● 25 నుంచి పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు
● తీవ్రంగా వ్యతిరేకిస్తున్న
ఉపాధ్యాయ సంఘాలు
●
నరసరావుపేట ఈస్ట్: ప్రభుత్వ పాఠశాలల పని వేళలు మరో గంట పెంచుతూ కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టాక వారిపై పనిభారం పెరుగుతోంది. యాప్‌లలో అప్‌లోడింగ్, అపార్ నమోదు వంటి ఊపిరి సలపని పనులతో ఇప్పటికే వారు సతమతమవుతున్నారు. ఇప్పుడు గంట పని భారం పడుతుండడంతో నిరసన గళం వినిపిస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఐదునెలలు గడుస్తున్నా బకాయిల చెల్లింపు విషయంలో అడుగు ముందుకు పడలేదు. మధ్యంతర భృతి ప్రకటన మృగ్యమైంది. ఒకటో తేదీనే జీతాలు అందుతాయన్న ఆశ ఆగస్ట్ నెలలోనే అడుగంటింది.
తొలుత పైలెట్ ప్రాజెక్టుగా..
తొలుత పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో ఎంపిక చేసిన 11 పాఠశాలల్లో కొత్త పనివేళలు ఈనెల 25 నుంచి అమలు కానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమై 5 గంటల వరకు పనిచేస్తాయి. చలికాలంలో సాయంత్రం 5.30 గంటలకే చీకట్లు ముసురుతున్న నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. అయితే 30వ తేదీ వరకు ఎంపిక చేసిన పాఠశాలల్లో పనివేళలు అమలు చేసి ఫలితాలపై సమీక్షించి ఆ తర్వాత తుది నిర్ణయం ఉంటుందని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.
భిన్నాభిప్రాయాలు..
పాఠశాలల్లో గంట పని వేళ పెంచటం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుకునేందుకు సమీప గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. ఉదయం 9గంటలకు పాఠశాల ప్రారంభమైతే విద్యార్థులు ఇంటి వద్ద నుంచి ఒక గంట ముందుగా బయలుదేరాల్సి ఉంటుంది. ఉదయం 8గంటలకు ఇంటి వద్ద నుంచి బడికి వచ్చిన విద్యార్థి తిరిగి సాయంత్రం 5గంటలకు పాఠశాల ముగించుకొని ఇంటికి వెళ్లేసరికి దాదాపు సాయంత్రం 6 గంటలు అవుతుంది. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారని చెబుతున్నారు. దీంతోపాటు ఒక్కో పీరియడ్ 45 నిమిషాల చొప్పున 8 పీరియడ్లు పెట్టడం వల్ల విద్యార్థులు మరింత అలసిపోయే ప్రమాదముందని పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులపైనా రెట్టింపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులూ ఉదయం 7 లేదా 8 గంటలకే ఇంటివద్ద నుంచి పాఠశాలకు బయలుదేరి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలోనే ఉండి తిరిగి ఇంటికి చేరుకునేందుకు సాయంత్రం 6 లేదా 7 గంటలు అవుతుందని, ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయినులకు ఇది కష్టంగా మారుతుందని, ఈ ప్రభావం బోధనపై తీవ్రంగా పడుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాలల పని వేళలు మార్చాలంటే విద్యార్థుల మానసిక స్థితి, విద్యార్థి అభ్యాసన సంసిద్ధత, విద్యార్థినుల భద్రత, రవాణా తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఏ రాష్ట్రాలలోనూ పాఠశాలలు ఐదు గంటల వరకు పనిచేయడం లేదని, అత్యధిక అక్షరాస్యతా శాతం ఉన్న కేరళలోనూ సాయంత్రం 3 గంటల వరకే బడులు పనిచేస్తున్నాయని ఉదహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment