కక్కు కొడవళ్లకు కేరాఫ్ కొప్పెరపాడు
నాలుగు దశాబ్దాలుగా కొడవళ్ల తయారీ, అమ్మకాలు
● తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతం నుంచి వలస వచ్చిన కుటుంబం ● యంత్రాల రాకతో కొంతమేర తగ్గిన గిరాకీ ● ఆర్డర్లపై రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడులకు ఎగుమతులు ● సంవత్సరం పొడుగునా కార్ఖానాలో తయారీ
బల్లికురవ: కొడవలి వ్యవసాయానికి ఒక ప్రతీక లాంటిది. వ్యవసాయ రంగంలో కొడవలికి చాలా ప్రాధాన్యత ఉంది. అలాంటి కక్కు కొడవళ్ల తయారీలో కొప్పెరపాడు గ్రామానికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడులో ప్రత్యేక గుర్తింపు ఉంది. తూర్పుగోదావరి జిల్ల్లా కడియం ప్రాంతం నుంచి వీరవల్లి సముద్రాచారి సుమారు నాలుగు దశాబ్దాల కిందట బతుకుదెరువు కోసం బల్లికురవ మండలం కొప్పరప్పాడుకు వలస వచ్చారు. నార్కెట్‌పల్లి–మేదరమెట్ల నామ్ రహదారికి తూర్పుభాగంలో స్థలం కొనుగోలు చేసి నివాసం ఏర్పరచుకున్నారు. ఆరంభంలో వడ్రంగం పని చేశారు. ఈయనకు సత్యనారాయణ, పాపాచారి, వెంకట్రావు ముగ్గురు కుమారులు. ఈ ప్రాంతంలో ఆహార ధాన్యమైన వరి, కంది, జూట్, పశుగ్రాసం సాగు ఎక్కువగా ఉండటంతో కక్కు కొడవళ్లు తయారు చేయించి విక్రయించాలని సముద్రాచారి భావించారు. ముగ్గురు కుమారులకు కొడవళ్ల తయారీ నేర్పించారు.
తెనాలి నుంచి ముడిసరుకు దిగుమతి
కొడవళ్ల తయారీకి అవసరమైన ముడిసరుకు తెనాలి ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కొడవళ్లు హోల్‌సేల్, రిటైల్‌గా లోకల్‌లో అమ్మకాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు, కర్ణాటక, తమిళనాడు, ఆర్డర్లపై ఎగుమతి చేస్తున్నారు. ఆరంభంలో వీరి దగ్గర పని నేర్చుకున్న వారితో కలిపి ప్రస్తుతం గ్రామంలో 8 వరకు తయారీ కార్ఖానాలు ఉన్నాయి. ఒక్కో కార్ఖానాలో ముగ్గురు నుంచి నలుగురు కార్మికులు పనిచేస్తున్నారు. రోజుకు 180 నుంచి 200 వరకు కొడవళ్లు తయారు చేస్తున్నారు.
యంత్రాల రాకతో తగ్గిన గిరాకీ
పదేళ్ల కిందట వరకు ప్రతి రోజూ గిరాకీ ఉండేది. వరి, కంది, జూట్ కోతలకు యంత్రాలు రావటంతో కొంత గిరాకీ తగ్గింది. కొప్పెరపాడు కొడవలికి మంచి పేరు ఉండటంతో ఆర్డర్లు బానే వస్తున్నాయని వీరవల్లి సముద్రాచారి (చిన్న) వెంకటేశ్వర్లు, వెంకట్రావు, నాగప్రసాద్, గాలి శివాజీ, బాబి సాక్షి తెలిపారు. ఒక్కో కొడవలి రిటైల్‌గా రూ.100 నుంచి రూ.120. హోల్‌సేల్‌లో రూ.100లకు అమ్ముతున్నామని చెప్పారు.
కొడవలి తయారీతో స్థిరపడ్డాం..
మా తాత సముద్రాచారి ఈ ప్రాంతానికి వలస వచ్చాడు. నా తండ్రి పాపాచారి కొడవలి తయారీ పనిని తనకు నేర్పటంతో జీవనానికి ఇబ్బంది లేదు. సంవత్సరం పొడవునా రైతులు, వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొంటూనే ఉన్నారు.
– వీరవల్లి సముద్రాచారి (చిన్న)
కొప్పెరపాడు కొడవలికి పేరు..
కొప్పెరపాడులో తయారయ్యే కొడవలికి మంచి పేరు ఉంది. నాణ్యతతోపాటు కక్కు కోస్తే సంవత్సరం పొడుగునా ఉపయోగపడుతుంది. పశువుల మేత, వరి, కంది కోతలకు కొడవళ్లు బాగున్నాయి. – పి శ్రీను, అద్దంకి
ధర కూడా అందుబాటులో..
కొప్పెరపాడులో తయారయ్యే కొడవళ్ల ధర అందుబాటులో ఉంటున్నాయి. పిడిలో పట్టుతోపాటు నాణ్యతలో రాజీలేకుండా తయారు చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తున్నాను.
– సునీల్, పెట్లూరివారిపాలెం,
Comments
Please login to add a commentAdd a comment