రాజస్థాన్, ఉత్తరాఖండ్ మ్యాచ్ డ్రా
మంగళగిరి: విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్ – 16లో రాజస్థాన్, ఉత్తరాఖండ్ మధ్య క్రికెట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. నగర పరిధిలోని అమరావతి టౌన్‌షిప్‌లో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 82.1 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌటైంది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ యశ్వంత్ భరధ్వాజ్ 50 పరుగులు సాధించగా, షైఫన్ ఖాన్ 48 పరుగులు చేశాడు. ఉత్తరాఖండ్ బౌలర్లు నియాన్ త్యాగి, మెహ్మద్ షాహిద్‌లు చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఉత్తరాఖండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 102.5 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది. ఉత్తరాఖండ్ బ్యాట్స్‌మెన్‌లు అభిమన్యు 75 , అనయనేగి 71, కుషేర్గ జెడ్ 54 పరుగులు సాధించారు. రాజస్థాన్ బౌలర్లు మిరాన్ ఖాన్, సుజాల్ ఫర్మార్ 3 వికెట్ల చొప్పున తీశారు. రాజస్థాన్ రెండవ ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 243 పరుగులు సాధించింది. రజత్ బాగెల్ 86, రాహుల్ 81, సైఫన్ ఖాన్ 51 పరుగులు సాధించారు. దీంతో మ్యాచ్ డ్రా అయింది. ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడంతో మూడు పాయింట్లు సాధించింది. రాజస్థాన్ ఒక పాయింట్ పొందింది.
Comments
Please login to add a commentAdd a comment