ఉపాధ్యాయులపై భౌతికదాడులు తగదు
రేపల్లె రూరల్: సమాజాభివృద్ధికి దోహాదపడుతున్న ఉపాధ్యాయులపై భౌతికదాడులకు పాల్పడటం తగదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల కొల్లూరు మండలంలో ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు దాడులకు పాల్పడటం బాధాకరమన్నారు. దాడుల వల్ల ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నారు. ఉపాధ్యాయులు ఏమైనా తప్పులు చేస్తే సంబంధిత అధికారికి ఫిర్యాదు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలేగాని దాడులకు పాల్పడటం బాధాకరమన్నారు. ఖండించిన వారిలో ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏ.శేఖర్‌బాబు, పీడీ సోషలిజం, దోవా రవి, సిహెచ్ శ్రీనివాసరావు, తాతా శ్రీనివాసరావు, సత్యనారాయణ తదితరులున్నారు.
మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు
పట్నంబజారు: మహిళపై అత్యాచారానికి పాల్పడి, బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. దిశ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లపాడు రోడ్డులోని ఓ ప్రాంతంలో బడ్డీకొట్టు నిర్వహించే మహిళకు రెండు సంవత్సరాల క్రితం వెంగళాయపాలెంకు చెందిన దేవరకొండ నాగేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. మహిళను శారీరకంగా లొంగదీసుకున్న నాగేశ్వరరావు.. వీడియో చిత్రీకరించారు. దానిని చూపించి బెదిరిస్తూ బాధితురాలి నుంచి పలు దఫాలుగా డబ్బులు వసూలు చేశాడు. తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళకు వివాహమై ఇరువురు సంతానం ఉన్నారు. ఈ విషయం ఎవరికై నా చెబితే భర్తతోపాటు బిడ్డలను చంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
ధనుర్మాస మహోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
తాడేపల్లిరూరల్: మంగళగిరి పట్టణ పరిధిలోని బాపూజీ విద్యాలయంలో ధనుర్మాస మహోత్సవాల పోస్టర్‌ను మంగళగిరి పట్టణ వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. పాత మంగళగిరి శ్రీకృష్ణ చైతన్య వృద్ధుల ఆశ్రమంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు నందం జోగేంద్రచక్రవర్తి మాట్లాడు తూ శ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామా నుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ నెల 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు జరిగే ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా ఈ నెల 17వ తేదీన అమ్మవారికి సారె సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం జీయర్ స్వామి చేతుల మీదుగా తీర్థ గోష్టి, సాయంత్రం స్వామివారి అనుగ్రహ భాషణ ఉంటాయని తెలిపారు. తరంగిణి ప్రతినిధులు విజయలక్ష్మి, డి.శ్రీహరిరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment