‘నీరు’గారిన ప్రజాస్వామ్యం
సాక్షి ప్రతినిధి,బాపట్ల: ఎన్నికలంటే కూటమి పార్టీలకు చులకనభావమా? ఓటుకు విలువనివ్వకుండా ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నాయా? స్వపక్ష నేతలు, కార్యకర్తల అభిప్రాయాలకూ విలువనివ్వడంలేదా? తాము చెప్పిన వారికే పదవులంటూ ఏకపక్ష నిర్ణయాలతో కూటమి నేతలు జులుం ప్రదర్శిస్తున్నారా? పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారా? వీటన్నింటికీ స్వపక్ష నేతలు, కార్యకర్తల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. సర్కార్ తీరును వారు ఎండగడుతుండడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరిగిన సా గునీటి సంఘాల ఎన్నికల తీరు దీనికి నిదర్శనం.
అంతా ఏకపక్షమే!
సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను కూటమి పాలకులు అపహాస్యం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం అమృతలూరు మండలం కూచిపూడి జలవనరులశాఖ అతిథి గృహంలో కృష్ణా వెస్ట్రన్ డెల్టా సాగునీటి ప్రాజెక్ట్ కమిటీ ఎన్నిక జరగ్గా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పార్థసారథి హాజరయ్యారు. రేపల్లె నియోజకవర్గం నిజాంప ట్నంకు చెందిన మురళీధరరావును చైర్మన్‌గా గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన సునీల్ చౌదరిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ పదవులను రెండు, మూడేళ్ల చొప్పున పంపకానికి పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఈ నెల 17న ఎన్నికై న 22 మంది డిస్ట్రి బ్యూటరీ కమిటీ చైర్మన్‌లు ఎన్నుకోవాలి. అయితే కూటమి నేతలు దీనికి విరుద్ధంగా వ్యవహరించారు. ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారు. చినగంజాంకు చెందిన వీరయ్యచౌదరితోపాటు బాపట్ల, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు రైతు నేతలు ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఆశించారు. కానీ జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకొని సభ్యుల అభిప్రాయాలకు విలువనివ్వకుండా ఏకపక్షంగా ఎన్నిక నిర్వహించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
బెదిరింపుల పర్వం మధ్య..
అంతకు ముందు ప్రాదేశిక సభ్యులు, సాగునీటి వివియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఎంపికలోనూ ఏకపక్షంగా వ్యవహరించారు. వాస్తవానికి జిల్లాలో ఉన్న 4 లక్షలమంది రైతు ఓటర్లు 2,040 మంది ప్రాదేశిక సభ్యులను ఎన్నుకోవాలి. అయితే టీడీపీ నేతల ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతోపాటు పోలీసులు కలిసి బెదిరింపులకు దిగి ప్రాదేశిక సభ్యులను ఏకపక్షంగా ఎంపికచేశారు. ఎన్నిక జరిగిన రోజు మధ్యాహ్నం 170 సాగునీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ప్రాదేశిక సభ్యులు ఎన్నుకోవాల్సివుండగా వారి అభిప్రాయాలకు తావివ్వలేదు. వీరంతా కలిసి 22 మంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకోవాల్సివుండగా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. తాజాగా 22 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఎన్నుకోవాల్సిన ప్రాజెక్ట్ కమిటీనీ మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రి ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమిలోని నేతలు ప్రాదేశికాలు, సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీలకు పోటీచేయాలని యత్నించినా తాము ఎంపిక చేసినవారు తప్ప మరెవరూ పోటీ చేయకూడదని పెద్దలు అల్టిమేటం జారీచేయడం విస్తుగొలిపింది.
Comments
Please login to add a commentAdd a comment