చలితో జర జాగ్రత్త!
ఇల్లెందురూరల్: గడిచిన పది రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో ఎండ వచ్చేవరకు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావడంలేదు. అయినా చలి ప్రభావంతో ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రధానంగా జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, న్యూమోనియా, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కాగా చలి నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య సహాయం పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.
జలుబు, జ్వరం, దగ్గు..
చలితో చిన్నారులకు జ్వరంతోపాటు చర్మంపై దద్దుర్లు, చిన్నచిన్న కురుపులు వంటి సమస్యలు వస్తున్నాయి. జలుబు, దగ్గు, అస్తమాకు గురవుతున్నారు. వృద్ధుల్లో చర్మం త్వరగా పొడిబారుతుంది. ఉసిరిక, సోరియాసిస్ ఉన్న వాఽళ్లలో చర్మవ్యాధులు అధికమవుతాయి. వెచ్చదనం కోసం చలిమంట వద్ద, ఎండ వేడిమికి అత్యధిక సమయం గడిపినా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
చలిలో తిరగొద్దు..
చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో చిన్నారులు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చలికి ఎండలో కూర్చునేవారు... తీవ్రత పెరిగినపుడు కూడా ఎండలోనే ఉంటే అనారోగ్యానికి గురవుతారని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులను ఉదయం, సాయంత్రం బయట తిరగకుండా చూడాలి. ఈదురు గాలులు వచ్చిన సమయంలో అప్రమత్తంగా ఉండాలి. వేడి, వేడి ఆహార పదార్థాలు మాత్రమే ఇవ్వాలి. ఇంటి బయట తినుబండారాలకు దూరంగా ఉండాలి. చిన్నారులకు ఐస్‌క్రీమ్, ఫ్రిజ్‌లో పెట్టిన ఆహార పదార్థాలు, కూల్‌డ్రింక్‌లు ఇవ్వొద్దు. గోరువెచ్చని నీటిని మాత్రమే తాగించాలి. అత్యవసరమైతే బయటకు వెళ్లే సమయంలో చలికి రక్షణగా ఉన్ని దుస్తులు ధరించాలి. తలకు ఉన్నితో తయారు చేసిన టోపీ, చేతులకు గ్లౌజ్‌లను ధరింపచేయాలి. ఇంట్లోని పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. చలి తీవ్రత కారణంగా శరీరం పొడిబారకుండా నూనెలను, పలు రకాలైన లోషన్లను శరీరానికి పట్టించాలి.
రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత
జలుబు, జ్వరం, చర్మవ్యాధుల బారిన ప్రజలు
రక్షణ నియమాలు పాటించాలని సూచిస్తున్న వైద్యులు
ఆస్పత్రులు కిటకిట
శీతాకాలంలో వచ్చే వ్యాధులతో ప్రజలు సమీపంలోని నిపుణులైన వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు. వీరిలో జ్వరం, జలుబు, దగ్గు, చర్మవ్యాధుల బాధితులే ఉంటున్నారు. పెద్దవారి కంటే వృద్ధులు, 15ఏళ్లలోపు పిల్లలు అత్యధికులు కనిపిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చలి బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
వేడినీటితో స్నానం చేయించాలి
చిన్నారుల వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపించి జలుబు, దగ్గు, జ్వరాలు వస్తుంటాయి. బెడ్‌షీట్లు, దిండు కవర్లు, కర్టెన్లు తరచూ మార్చాలి. పిల్లలకు చల్లని ఆహార పదార్థాలు ఇవ్వొద్దు. వేడినీటితో స్నానం చేయించాలి. చర్మ సమస్యలు రాకుండా చేతులు, కాళ్లకు లోషన్, నూనె పట్టించాలి. –డాక్టర్ మోతీలాల్,
పిల్లలవైద్య నిపుణుడు, ఇల్లెందు
అశ్రద్ధ చేయొద్దు
చలికాలంలో ఆరోగ్య సమస్యల పట్ల అశ్రద్ధ చేయొద్దు. ఈ సమయంలో ఆస్తమాతోపాటు చర్మసంబంధ వ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రధానంగా చలి తీవ్రతకు చర్మం పగిలి మరింత ఇబ్బంది పెడుతుంది. రక్షణగా తలకు, చేతులకు ఉన్ని దుస్తులు ధరించాలి. కాళ్లకు షూ వినియోగిస్తే మంచిది. చిన్నారులు గురక పెట్టినా, ముక్కు కారుతున్నా వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.
– డాక్టర్ కవిత, వైద్యాధికారి, రొంపేడు పీహెచ్‌సీ
Comments
Please login to add a commentAdd a comment