వైద్యులకు కలెక్టర్ అభినందన
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియాస్పత్రి వైద్యులను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అభినంధించారు. చర్ల మండలం రాళ్లపురం గ్రామానికి చెందిన 39 ఏళ్ల కుంజం ముయ్యమ్మకు నెలలు నిండటంతో ఆమె బంధువులు ఈ నెల 11న భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకి దాదాపు 9 సార్లు మూర్చ రావడంతోపాటు అధిక రక్తపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఎన్ని మందులు వాడినా స్పృహలోకి రాకపోవడంతో ఆపరేషన్ చేసి కడుపులోని బిడ్డను బయటకు తీయగా.. ఎలాంటి చలనం లేకపోడంతో వైద్యులు శ్రమించి.. బిడ్డకు ప్రాణం పోశారు. వారం పాటు ముయ్యమ్మను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించగా ఆమె కోలుకుంది. దీంతో తల్లీబిడ్డలను ఇంటికి పంపించారు. కాగా, వైద్యులు ప్రమీల, సాత్విక, నిఖిత, మౌనిక, విజయరావుతో పాటు భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణను జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అభినందించారు.
సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
దుమ్ముగూడెం: సీఎం కప్ రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు మండలానికి చెందిన వెంకటేశ్వర్లు (బన్నీ), పూనెం బిందు ఎంపికయ్యారని జిల్లా కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఇంద్రాల శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న ఆటగాళ్లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
అఽథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థి ఎంపిక
పాల్వంచ: అథ్లెటిక్స్ పోటీల్లో అంగవైకల్యాన్ని అధిగమించిన హర్షిత్.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. శుక్రవారం కొత్తగూడెంలోని పారా అథ్లెటిక్స్ పోటీల్లో పాల్వంచకు చెందిన స్టార్ చిల్డ్రన్స్ స్కూల్ 8వ తరగతి విద్యార్థి హర్షిత్ 100, 200 మీటర్ల పరుగుపందెంలో సత్తా చాటి.. వచ్చే నెల 4, 5 తేదీల్లో గచ్చి బౌలిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. విద్యార్థిని జిల్లా సీఎం కప్ కన్వీనర్ తిరుమల్‌రావు, పీఈటీలు, తల్లిదండ్రులు వీరబ్రహ్మేందర్, ఉమా అభినందించారు.
టీచర్లు లేకపోవడంతో విద్యార్థుల నిరసన
పాల్వంచ: పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యాబోధన చేసే టీచర్లు లేకపోవడంతో శుక్రవారం విద్యార్థులు నిరసన తెలిపారు. వారికి ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. టీచర్లు లేక పోవడంతో తరగతులు జరగడం లేదన్నారు. టీచర్లు చేస్తున్న సమ్మైపె ప్రభుత్వం స్పందించాలని, పాఠశాలల్లో టీచర్లు లేక చదువులు ఆగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వరక అజిత్, గుండాల సుజన్, మోటా రాజు, పవన్‌కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
‘సింగరేణి’మహిళలకు
ఆటల పోటీలు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి డే సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మహిళలకు శుక్రవారం ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను డి.హరిణి సత్యనారాయణరావు, జి.సునీతా వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు. అనంతరం పాసింగ్ దబాల్, మ్యూజికల్ చైర్, బాంబ్ ఇన్ సిటీ తదితర పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొనగా, విజేతలకు ఈ నెల 23న బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీజీఎం రాజేంద్రప్రసాద్, కమ్యూనికేషన్ ఆఫీసర్ టి.శ్రీనివాసరావు, సేవా కోఆర్డినేటర్ ఇజాజ్ షరీఫ్, సేవా సెక్రటరీ సుజాత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment