అడవుల్లో తుపాకుల గర్జన
జిల్లాలోకి మావోలు..
మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్‌హంట్ చివరి దశకు చేరుకుని మిషన్ కగార్‌గా మారింది. దీంతో దండకారణ్యంలో భద్రతా దళాలు మెరుపు వేగంతో చొచ్చుకుపోతున్నాయి. ప్రతీ ఆరు కిలోమీటర్లకు ఒకటి వంతున క్యాంపులను ఏర్పాటు చేస్తూ మావోలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వ భద్రతా దళాలతో పోరాటం చేస్తూనే మరోవైపు సరికొత్త షెల్టర్ జోన్ల వెతుకులాటలో పడ్డారు మావోయిస్టులు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేశారు. కరోనా సంక్షోభం ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచీ ఈ ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. సరిహద్దులో పోలీసు నిఘా పకడ్బందీగా ఉండటంతో మావోల ప్రయత్నాలు అంతగా సఫలం కాలేదు.
రెండు ఎన్‌కౌంటర్లు
రెండేళ్ల శ్రమ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం – అల్లూరి సీతారామారాజు డివిజన్‌కు అనుబంధంగా పని చేసే మణుగూరు – పాల్వంచ ఏరియా దళాలు జిల్లాలోకి అడుగు పెట్టగలిగాయి. మొత్తం పదిహేను మంది మావోలు జిల్లాకు వచ్చినట్టు ప్రచారం జరిగింది. మావోల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా వ్యూహంతో జూలై 25న గుండాల మండలం దామరతోగు అడవుల్లో నక్సౖలైట్ దళాలను చుట్టుముట్టారు. ఇక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు చనిపోగా మిగిలిన వారు తప్పించుకున్నారు. అప్పటి నుంచి మావోయిస్టు దళాలపై పోలీసులు మరింత నిఘా పెట్టారు. చివరకు సెప్టెంబరు 5న కరకగూడెం మండలం మోతె అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఆగురుగు మావోయిస్టులు చనిపోగా ఓ మావోయిస్టు తప్పించుకున్నాడు. ఆ తర్వాత ములుగు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఏడుగురు చనిపోవడంతో జిల్లాలో దళాల సంచారం మరోసారి సద్దుమణిగినట్టయ్యింది.
వరుస లొంగుబాట్లు
ఓ వైపు మావోయిస్టు దళాల కదలికలపై గట్టి నిఘా పెట్టిన పోలీసులు మావోయిస్టు సానూభూతిపరులు, మద్దతుదారుల సమస్యలపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఎస్పీ రోహిత్‌రాజు ఆధ్వర్యంలో వలస ఆదివాసీగూడేల్లో తరచూ పర్యటించడం, రోడ్లు వేయించడం, పాఠశాలలకు మరమ్మతులు చేయించడం, మెడికల్ క్యాంపులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేస్తున్నారు. దీంతో నాగరిక జీవితాలకు దూరంగా ఉండే వలస ఆదివాసీ గూడెలకు ప్రభుత్వ పథకాలు చేరువయ్యేందుకు ఆస్కారం కలిగింది. ఆదివాసీల్లో భరోసా కల్పించడంలో సక్సెస్ అయ్యారు. గడిచిన ఏడాది కాలంగా మావోయిస్టులు, మద్దతుదారులు లొంగుబాట పట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి మొగ్గు చూపుతున్నారు.
ఏడాదిలో రెండు ఎన్‌కౌంటర్లు
ఏడుగురు మావోయిస్టులు మృతి
పదుల సంఖ్యలో మావోల
లొంగుబాటు
తెలంగాణలో ఏకై క మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవుల్లో ఈ ఏడాది తుపాకులు గర్జించాయి. రెండు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకోగా ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు పలువురు మావోయిస్టులు, సానుభూతిపరులు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
తగ్గని ఉద్రిక్తత
కేంద్రం, మావోయిస్టుల మధ్య జరుగుతున్న పోరు తారాస్థాయికి చేరుకోవడంతో దండకారణ్యంతో సరిహద్దు పంచుకుంటున్న భద్రాద్రి జిల్లాలో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జాయింట్ టాస్క్ ఫోర్స్ యూనిట్‌ను జిల్లాలో ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రిని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే కోరారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల సరిహద్దులో ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాల క్యాంపులపై మావోయిస్టులు దాడులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఛత్తీస్‌గఢ్ ప్రభావం జిల్లాపై ఎక్కువగా పడకుండా నిరోధించడంలో పోలీసులు సఫలమవుతున్నారనే అభిప్రాయం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment