వేటేయాలంటే.. ఓటుండాలి
●18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ●ఏటా కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల కమిషన్ చర్యలు
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
చుంచుపల్లి: ఓటే వజ్రాయుధం. దేశ ప్రజాసామ్య సౌధానికి ఓటు హక్కే పునాదిగా నిలుస్తోంది. ప్రశ్నించే అధికారం కలిగిన ఓటు హక్కును ప్రతి పౌరుడికీ భారత రాజ్యాంగం ప్రసాదించింది. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పాలకులను ఓటు ద్వారానే ఎన్నుకుంటాం. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1961 జనవరి 25న అప్పటి ప్రభుత్వం ఓటు హక్కు నమోదును ప్రారంభించింది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు నమోదు చేయించుకునేందుకు ప్రభుత్వం ఏటా స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. ప్రతి వెయ్యి మంది జనాభాలో 698 మంది ఓటర్లు ఉండాలనే లెక్కలతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. యువకులు అధికంగా ఉండే ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ఇతర కళాశాలల యాజమాన్యాలను ఇందులో భాగస్వామ్యం చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం 2011 నుంచి ప్రతి ఏటా జనవరి 25ను జాతీయ ఓటరు దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా యువ ఓటర్లకు ఓటు హక్కు వినియోగం, విలువలపై ర్యాలీలు, సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తోంది.
ఓటు హక్కు పొందండి ఇలా..
ప్రస్తుతం ఓటు హక్కు పొందడం చాలా సులభంగా మారింది. గ్రామస్థాయిలో పోలింగ్ బూత్ లెవల్ అధికారుల వద్ద దరఖాస్తులు పూర్తి చేసి నమోదు చేసుకోవచ్చు. ఓటరు పేరు, ఇంటి నంబరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబరు వివరాలు సేకరించి నమోదు చేస్తారు. ఇందుకు ఫారం ఎఫ్–6,7,8ఏలను వినియోగిస్తారు. దరఖాస్తులు పంచాయతీ, రెవెన్యూ, మీ సేవా కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. 1950 జనవరి 25న మొట్టమొదటిసారిగా దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పౌరుడికి తొలిసారిగా ఓటు హక్కు కల్పించారు. 1952లో మొట్టమొదటిసారి నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటరు జాబితా ఆధారంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1992 వరకు ఎలక్ట్రో ఫొటో ఐడెంటిటీ కార్డు ఉండేది కాదు. 1993లో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఉన్న టీఎన్ శేషన్ ఓటర్ల గుర్తింపు కార్డుల ప్రక్రియను ప్రారంభించారు.
జిల్లాలో ఓటర్ల వివరాలు
మొత్తం ఓటర్ల సంఖ్య : 9,95,150
పురుషులు : 4,81,985
మహిళలు : 5,12,364
సర్వీస్ ఓటర్లు : 737
ఇతరులు : 64
సద్వినియోగం చేసుకోవాలి
అందరూ ఓటు విలువ తెలుసుకోవాలి. మన ఓటు ఐదేళ్లపాటు సుపరిపాలన అందించే వ్యక్తి భవితవ్యాన్ని తేలుస్తుంది. ఎన్నికల సమయంలో ఓటును నోటుకు బలిచేఝెద్దు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
–నీరుకొండ హన్మంతరావు, సీనియర్ సిటిజన్, విద్యానగర్
Comments
Please login to add a commentAdd a comment