వరంగల్ క్రైం: రూ.లక్ష అసలు కరెన్సీకి నాలుగు రెట్లు అధికంగా నకిలీ నోట్లు మార్పిడి చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేయగా వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా శనివారం వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజరకు చెందిన మణికాల కృష్ణ, నక్రిపేటకు చెందిన ధరమ్‌సోత్ శ్రీను, తేజావత్ శివ, ముల్కలపల్లి మండలం మూకమామడికి చెందిన గుగులోత్ వీరన్నతో పాటు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌కు చెందిన ఎర్రగొల్ల శ్రీనివాస్, ఉడుత మల్లేశ్, ఎర్రగొల్ల అజయ్, ఏపీలోని కర్నూలు జిల్లా కుర్విపేట మండలం వేల్పనూర్‌కు చెందిన బిజిని వేముల వెంకటయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధాన నిందితుడైన మణికాల కృష్ణ గొర్రెల వ్యాపారం చేస్తుండగా ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. గొర్రెల వ్యాపారంలో పరిచయమైన వ్యక్తులతో తనకు అడవిలో డబ్బుతో కూడిన డ్రమ్ము దొరికిందని, ఆ డబ్బు వినియోగిస్తే ఆరోగ్య, ఇతర సమస్యలు ఎదురవుతున్నాయని నమ్మించాడు. ఎవరైనా రూ.లక్ష ఇస్తే వారికి రెండింతల డబ్బు ఇస్తానని, అలాగే రూ.లక్ష అసలు ఇస్తే నాలుగు రెట్లు అధికంగా నకిలీ నోట్లు ఇస్తానని చెప్పేవాడు. ఆపై ఎర్రగొల్ల శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడగా కృష్ణకు తొలుత అసలు రూ.500నోట్లు చూపించడంతో మార్పిడి చేసేలా అంగీకారం కుదిరింది. ఆ డబ్బును హనుమకొండలో తనకు ఇవ్వాలని శ్రీనివాస్ సూచించగా కృష్ణ, మరో నలుగురు నిందితులతో కలిసి కారులో శుక్రవారం కేయూసీ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వచ్చాడు. అక్కడ ఉన్న శ్రీనివాస్ మరో ఇద్దరు నిందితులతో కలిసి కరెన్సీ మార్పిడి చేసుకుంటుండగా పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. కారులో తనిఖీ చేయగా రూ.38.84లక్షల అసలు కరెన్సీ, రూ.21లక్షల నకిలీ నోట్లు, నకిలీ నోట్ల ముద్రణకు అవసరమైన కాగితాలు లభించడంతో విచారించగా నేరం అంగీకరించారు. ప్రధాన నిందితుడైన కృష్ణ ఇదే తరహాలో మరో మిత్రుడితో కలిసి తెల్లకాగితాలపై రూ.500 నోటు ముద్రించి పలుమార్లు మార్పిడి చేస్తూ పోలీసులకు చిక్కడంతో సత్తుపల్లి, వీ.ఎం.బంజర, లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు.
ఎనిమిది మంది సభ్యుల్లో ఉమ్మడి జిల్లా వాసులు
Comments
Please login to add a commentAdd a comment