ముగ్గురు టీచర్లకు మెమోలు
టేకులపల్లి: సమయపాలన పాటించని ముగ్గురు టీచర్లకు డీఈఓ వెంకటేశ్వరాచారి శనివారం మెమోలు జారీ చేశారని కాంప్లెక్స్ హెచ్‌ఎం జోగ రవి తెలిపారు. గురువారం మండలంలోని చుక్కాలబోడు, జేత్యాతండా గ్రామాల్లోని పాఠశాలల ఉపాధ్యాయులు చందూలాల్, గురుప్రసాద్, హెచ్‌ఎం స్వామి విధులకు ఆలస్యంగా హాజరైన వైనంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీంతో విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు.
తల్లీకూతుళ్లు అదృశ్యం
చండ్రుగొండ : మండలంలోని మద్దుకూరుకి చెందిన తల్లీకూతుళ్ల అదృశ్యంపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన ఏసుమణి తన ఆరేళ్ల కుమార్తెతో ఈ నెల 3న ఉపాధి కోసం మణుగూరు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె తల్లి కాకిరాల మరియమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ శివరామకృష్ణ తెలిపారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్
దుమ్ముగూడెం : మండలంలోని నడికుడి గ్రామానికి చెందిన జగిడి అర్జున్ ట్రాక్టర్‌ను శనివారం డ్రైవర్ జగిడి దీపక్ భద్రాచలం తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలో భద్రాచలం–చర్ల ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి ట్రాక్టర్ మూడు ముక్కలైంది. అప్రత్తమైన డ్రైవర్ కిందకు దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ
గుండాల: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను శనివారం విచారణ చేపట్టారు. మండల కేంద్రానికి చెందిన పల్లెపు జంపయ్య, వెంకన్నల మధ్య ఈ నెల 20న రాత్రి గొడవ జరిగింది. వెంకన్న తలపై కొట్టడంతో తలపగిలింది. దీంతో మరుసటి రోజు తండాకు చెందిన కొందరు పెద్దమనుషులను పిలిచి పంచాయితీ పెట్టారు. ఇద్దరికి నచ్చజెప్పే క్రమంలో మందలించారు. ఈ క్రమంలో జంపయ్య కోపోద్రిక్తుడై ఓ పెద్దమనిషిపై కత్తితో దాడిచేయగా చేతికి గాయమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను విచారణ చేపట్టారు. ఆయన వెంట సీఐ రవీందర్, ఎస్సై రాజమౌళి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment