● ఓ వైపు ప్రగతి..
●మరో వైపు పడిపోతున్న నైతికత ●సీనియర్ సిటిజన్ తాళ్లూరి పంచాక్షరయ్య
బూర్గంపాడు: అన్నివర్గాలకు సమాన హక్కులు, అభ్యున్నతి కోసం ఏర్పరుచుకున్న రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండనున్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఆ సంబురాల్లో పాలుపంచుకున్న బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామానికి తాళ్లూరి పంచాక్షరయ్యకు ప్రస్తుతం 93ఏళ్లు నిండాయి. ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్న ఆయన ‘సాక్షి’తో శనివారం మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. ఆ వివరాలు పంచాక్షరయ్య మాటల్లోనే..
అణగారిన వర్గాలకు ఊరట
రాజ్యాంగం అమలైన తొలి 25 ఏళ్లలో అణగారిన వర్గాలకు కొంతమేర ఊరట లభించింది. అప్పటి వరకు వెట్టిచాకిరీలో మగ్గిన వర్గాలు స్వశక్తితో జీవనోపాధులను మెరుగుపరుచుకున్నాయి. సంప్రదాయ వ్యవసాయ పంటల స్థానంలో మిర్చి, పొగాకు, పత్తి, పసుపు వంటి వాణిజ్య పంటల సాగు మొదలైంది. ఆ తర్వాత 25 ఏళ్లలో పంట దిగుబడులు పెంచుకునేందుకు ఎరువులు, పురుగుమందుల వినియో గం పెరిగింది. దీంతో దిగుబడులు పెరిగిన వ్యవసాయ ఉత్పత్తుల్లో మందుల ఆవశేషాలు పెరుగుతున్నాయి. గత 25 ఏళ్లలో వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతికత మరింతగా పెరిగింది. దిగుబడులు గతంలో కంటే రెట్టింపు స్థాయికి చేరాయి. అదే సమయంలో పంట ఉత్పత్తుల్లో నాణ్యత, స్వచ్ఛత లోపించాయి. వ్యవసాయ రంగంలో 75శాతం మేర యాంత్రీకరణ మొదలైంది. వ్యవసాయ పనులకు కూలీల కొరత పెరుగుతోంది.
అనేక మార్పులు
విద్యారంగంలో చాలా మార్పులు వచ్చాయి. డిగ్రీలు, పీజీలు చదివిన వారికి కూడా నైతిక విలువల తెలియటం లేదు. చదువుకుని ఉద్యోగాలు సంపాదించి డబ్బు సంపాదించాలనే ఆతృత ప్రస్తుత యువతలో కనిపిస్తోంది. నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. ప్రతీ ఒక్కరి లక్ష్యం డబ్బు సంపాదనే. అది నైతికమా... అనైతికమా అనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈక్రమంలో మోసాలు, నేరాలు పెరిగిపోతున్నాయి. ఒకరి ఎదుగుదలను మరొకరు ఓర్చుకునే పరిస్థితులు లేవు.
విలువలు దిగజారాయి
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన సాగుతోంది. స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు ఎంతకై నా తెగిస్తున్నారు. రాజకీయాల్లో, పరిపాలనలో నైతిక విలువలు పూర్తిగా దిగజారాయి. అధికారం కోసం అన్ని రాజకీయపక్షాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు సమైక్యత స్ఫూర్తి కొరవడుతోంది. ప్రపంచంలో నైతిక విలువలకు భారతదేశాన్ని ఆదర్శంగా చెప్పుకుంటారు. ఇప్పుడ ఆ పరిస్థితి దిగజారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment