సమన్వయంతో ప్రమాదాలకు చెక్
భారజల కర్మాగారం జీఎం జగ్గారావు
అశ్వాపురం: భారజల కర్మాగారంలో ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా ప్రమాదవశాత్తు హైడ్రోజన్ సల్ఫైడ్ విడుదలైతే ప్రజలెవరూ ప్రమాదాల బారిన పడకుండా సమన్వయంతో పని చేయనున్నట్లు కర్మాగారం జీఎం జగ్గారావు వెల్లడించారు. గౌతమీనగర్ కాలనీలో శుక్రవారం రెవె న్యూ, మండలపరిషత్, ఐకేపీ అధికారులు, సి బ్బందితో జీఎం సమావేశమయ్యారు. తొలుత సేఫ్టీ మేనేజర్ యోహాన్ విషవాయువు విడుదలైతే తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం జీఎం జగ్గారావు మాట్లాడుతూ దేశానికే తలమానికంగా ఉన్న కర్మాగారం పరిధిలో 30 ఏళ్లుగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇదే ఒరవడి కొనసాగేలా అందరూ సహకరించాలన్నారు. ప్రమాదవశాత్తు విషవాయువు విడుదలైతే ప్రజలను అప్రమత్తం చేయడమే కాక వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో కర్మాగారం సీఏఓ వేణు, తహసీల్దార్ స్వర్ణలత, ఎంపీడీఓ వరప్రసాద్, ఎంపీఓ ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.
కొమరారం వాసికి డాక్టరేట్
ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం వాసి నలమాస కృష్ణకు డాక్టరేట్ వరంచింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయనకు డాకరేట్ పట్టా అందజేశా రు. కొమరారం ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు పూర్తి చేసిన కృష్ణ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్సిటీలో రాజనీతిశాస్త్రంలో పీజీ, అక్కడే ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశాడు. 2011లో ‘తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర – విద్యార్థుల రాజకీయాలు’అనే అంశంపై ఎంఫిల్ చేశారు. ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన పీహెచ్‌డీ చేశారు. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ ల్యాంగ్వేజెస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్ విధాత పర్యవేక్షణలో ల్యాండ్ రీఫామ్స్ అండ్ రిలేషన్స్ ఇన్ తెలంగాణ అనే అంశంపై ఆయన పీహెచ్‌డీ పూర్తి చేసి, డాక్టరేట్ అందుకున్నారు.
కొత్తగూడెం క్లబ్ అధ్యక్షుడిగా కోనేరు
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం క్లబ్ నూతన అధ్యక్షుడిగా కోనేరు పూర్ణచందర్‌రావు ఎన్నికయ్యారు. శుక్రవారం క్లబ్‌లో జరిగిన సమావేశంలో 32 ఏళ్లుగా క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బాలోత్సవ్ జాతీయ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేశ్‌బాబు పదవీవిరమణ చేశారు. దీంతో మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడైన పూర్ణచందర్‌రావును సభ్యులు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయనతో పాటు రమేశ్‌బాబును సన్మానించారు. వివిధ పార్టీల నాయకులు, వ్యాపారులు ఆయనకు అభినందనలు తెలిపారు.
భద్రాచలం ఏరియా ఆస్పత్రికి రూ.14 లక్షల పరికరాలు
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రికి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చొరవతో రూ.14 లక్షల విలువైన నూతన పరికరాలు మంజూరయ్యాయి. వీటిలో ఐదు ఫీటల్ డాప్లర్ డిజిటల్, రెండు ట్వీన్ ప్రొబ్ సీటీజీ మెషిన్లు, రెండు ఏసీలు, రెండు ఫ్రిడ్జ్‌లు, ఒక బయో కెమిస్ట్రీ అనలైజర్, 9 మల్టీ పారా మానిటర్స్ విత్ నియో న్యాటల్ ప్రోబ్స్, 4 మైక్రో ప్రాసెసర్ కంట్రోల్ బేస్డ్ రేడియేంట్ వార్మర్ విత్ స్కిన్ అండ్ ఎయిర్ ప్రోబ్స్ తదితర పరికరాలు ఉన్నాయి. వైద్య పరికరాలు ఇప్పటికే ఆస్పత్రికి చేరుకున్నాయని, త్వరలోనే ఇన్స్‌టాల్ చేస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు.
ఏఏఈఓ మునీర్ పాషా మాతృసంస్థకు సరెండర్
భద్రాచలం: భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలోని విద్యుత్ శాఖ విభాగంలో పనిచేస్తున్న అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ మునీర్‌పాషాను మాతృ సంస్థకు చెందిన ఏస్‌ఈ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం, చట్టబద్ధమైన విధి విధానాలు పాటించక పోవడం, బాధ్యత గల పనుల్లో నిర్లక్ష్య వైఖరి కారణంగా ఆయనను సరెండర్ చేసినట్లు పీఓ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment