దుప్పిని చంపిన కేసులో ఒకరు రిమాండ్
పాల్వంచరూరల్: నాలుగేళ్ల కిందట దుప్పిని వేటాడి చంపిన వ్యక్తికి 14 రోజుల రిమాండ్ విధించారు. వైల్డ్‌లైఫ్ రేంజర్ కవితమాధురి కథనం మేరకు.. మండలంలోని యానంబైల్ రేంజ్ పరిధిలోని మొండికట్ట బీట్‌లో 2021 డిసెంబర్ 9న కిన్నెరసాని జలాశయం బ్యాక్ వాటర్ ప్రాంతంలో చేపలవేటకు వెళ్లిన మొండికట్టవాసులు దేశెట్టి నాగేశ్వరరావు, దాసరి సత్యనారాయణ, దేశెట్టి కృష్ణయ్య దుప్పిని వేటాడి చంపారు. దాని మాంసాన్ని పోగులు వేసుకున్న ఘటనలో ముగ్గురిపై వైల్డ్‌లైఫ్ యాక్టు కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో దేశెట్టి నాగేశ్వరరావును పట్టుకుని కోర్టులో హాజరు పరచగా ఆయిన కోర్టుకు గైర్హాజరవుతుండటంతో కొత్తగూడెం ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వారెంట్ జారీ చేశారు. దీంతో నాగేశ్వరరావును పట్టుకుని గురువారం కోర్టులో హాజరు పరుచగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించినట్లు రేంజర్ తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దురు పరారీలో ఉన్నట్లు ఆయన చెప్పారు.
వ్యక్తి ఆత్మహత్య..
కరకగూడెం: ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజేందర్ కథనం మేరకు.. మండలంలోని నీలాద్రి పేటగండి గొత్తికోయ గ్రామానికి చెందిన కుంజా ఇడమయ్య (48) రెండేళ్ల నుంచి మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడు. గతంలో రెండుసార్లు ఇంటి వెళ్లిపోగా కుటుంబ సభ్యులు వెతికి పట్టుకున్నారు. శుక్రవారం భర్గగూడెం గ్రామ శివారులోని చెరువు గట్టుపై ఉన్న చెట్టుకి ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలం వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. మృతుడి భార్య కుంజా పొజ్జమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. కాగా మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కుటుంబ కలహాలతో..
పాల్వంచ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని తెలంగాణనగర్‌కు చెందిన ఎస్‌కే చాంద్‌పాషా(42)కు, భార్య షమీరకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఫంక్షన్‌కు భార్య రానని చెప్పడంతో గొడవ జరిగింది. మనస్తాపం చెందిన చాంద్‌పాసా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య షమీర ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment