స్వర్ణకవచధారణలో రామయ్య
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని అంతరాలయంలో శుక్రవారం మూలమూర్తులు స్వర్ణ కవచధారులై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలను గావించారు.
1 నుంచి వాగ్గేయకారోత్సవాలు
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం నిర్మాణకర్త, రాముడికి అపర భక్తుడు, భక్త రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న జయంతి ఉత్సవాలకు వేళయింది. రామదాసు జయంతి సందర్భంగా ప్రతి ఏడాది దేవస్థానం ఆధ్వర్యంలో వాగ్గేయకారోత్సవాలను నిర్వహించటం ఆనవాయితీ. ఈ ఏడాది 392వ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో వేడుకలను జరపనున్నారు. శ్రీ నేండ్రగంటి అలివేలు మంగ సర్వయ్య చారిటబుల్ ట్రస్టు, దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు తరలిరానున్నారు. ఫిబ్రవరి 1న ఉదయం 9గంటలకు రామదాసు నవరత్న కీర్తనల గోష్టిగానంతో వేడుకలు ప్రారంభంకానున్నాయి. నగర సంకీర్తన, రామదాసు విగ్రహానికి అభిషేకం, ఐదు రోజులపాటు సంగీత కళాకారుల ప్రదర్శనలు ఉంటాయని ఆలయ ఈఓ రమాదేవి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment