మిర్చి తోటలో వ్యక్తి మృతదేహం
● హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి హత్య చేసిన నిందితులు ● మృతుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి రమేష్
కూసుమంచి: మండలంలోని లింగారంతండా సమీపాన జాతీయ రహదారి పక్కన ఉన్న మిర్చి తోటలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించగా.. హైదరాబాద్‌కు చెందిన సదరు వ్యక్తిని తీసుకొచ్చి హత్య చేసినట్లు తేలింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.... మిర్చి తోటలో మృతదేహాన్ని శుక్రవారం ఉదయం గుర్తించిన రైతు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై నాగరాజు పరిశీలించారు. మృతుడి రెండు చేతులు ప్లాస్టిక్ తాడుతో కట్టేసి ఉండటం, తలపై గాయాలు కనిపించడమే కాక మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఈనేపథ్యాన మృతుడు హైదరాబాద్‌కు చెందిన బొల్ల రమేష్(52)గా తేలింది. ఆయన రెండు రాష్ట్రాల్లో వ్యాపారులకు పాన్ మసాలా సరఫరా చేస్తుండగా ఈనెల 18న ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అక్కడి ఖార్ఖానా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేస్తుండగానే ఓ వ్యక్తి రమేష్‌ను హత్య చేసినట్లు చెబుతూ లొంగిపోయాడు. నలుగురు వ్యక్తులు ఆయనను కారులో ఖమ్మం వైపు 18వ తేదీ రాత్రి తీసుకొచ్చి హత్య చేశాక ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారి పక్కన మిరపతోటలో మృతదేహాన్ని పడవేసినట్లు చెప్పాడు. దీంతో అక్కడి పోలీసులు వచ్చి గాలించినా సరైన ప్రాంతం తెలియక వెనుతిరిగారు. ఇంతలోనే కూసుమంచి పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రమేష్ కుటుంబీకులతో శుక్రవారం రాత్రి వచ్చి మృతదేహం ఆయనదేనని నిర్ధారించుకున్నారు. డబ్బు కోసమే రమేష్‌ను హత్య చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిపోవడంతో ఘటనాస్థలంలోనే పంచనామా నిర్వహించి అన్నం ఫౌండేషన్ సభ్యుల సహకారంతోనే అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment