దమ్మపేట : సొంత వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్న పలు రకాల పచ్చి మిర్చి పంటలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. శుక్రవారం మండలంలోని గండుగులపల్లి గ్రామ శివారులోనున్న తన వ్యవసాయ క్షేత్రాలను మంత్రి తుమ్మల అనుచరులతో కలిసి సందర్శించారు. మిర్చి పంట కాపునకు రాగా కోసిన మిర్చి గుత్తులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వెంట అలపాటి రామచంద్ర ప్రసాద్, కాసాని నాగప్రసాద్, కేవీ తదితరులు ఉన్నారు.
డిజిటల్ లావాదేవీలపై శిక్షణ
చుంచుపల్లి: యూపీఐ డిజిటల్ లావాదేవీల వినియోగంపై సీఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులకు కలెక్టరేట్‌లో శుక్రవారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ విద్యాచందన హాజరై మహిళా సంఘాలకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ట్రైనర్ యుగంధర్ మాట్లాడుతూ బ్యాంకు రుణాలతోపాటు సామాజిక భద్రతా పథకాలు, ఇతర ఆర్థిక ఉత్పత్తుల వినియోగం, అంతర్గత అప్పులు, తిరిగి చెల్లింపులు, రికార్డుల నిర్వహణ, సమావేశాలు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ అడిషనల్ డీఆర్‌డీఓ నీలయ్య, ఏపీఎంలు, సీఆర్పీలు పాల్గొన్నారు.
పోస్టల్ ఖాతాలను విస్తరించాలి
అశ్వారావుపేట: పోస్టల్ ఖాతాలను ప్రతి ఇంటికి విస్తరించాలని తపాలా శాఖ సూపరింటెండెంట్(ఎస్పీ) వీరభద్రస్వామి సూచించారు. శుక్రవారం పోస్టాఫీస్‌లో అశ్వారావుపేట, దమ్మపేట గ్రామీణ తపాలా ఉద్యోగులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తపాలా సిబ్బంది పోస్టల్ పొదుపు ఖాతాలను అధిక సంఖ్యలో ప్రారంభింపజేయాలని సూచించారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలు, ప్రయోజనాలు, పొదుపు ఖాతాల ప్రయోజనాలను గ్రామాల్లో ప్రజలకు వివరించి ఖాతాలను పెంచాలని సూచించారు. ఎస్‌పీఎం సాయి ప్రభ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పాల్వంచ ఐపీవో వీరన్న, మెయిల్ ఓవర్సీస్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
రామాలయంలో
టెండర్లు ఖరారు
● వస్త్రాల విక్రయానికి రూ.50 లక్షలు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో భక్తులు స్వామివారికి సమర్పించిన వస్త్రాల విక్రయ టెండర్‌కు హెచ్చు ధర లభించింది. శుక్రవారం టెండర్లకు పాట నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి జనవరి 31, 2026 వరకు వస్త్రాల విక్రయానికి రూ.50,25,000కు భద్రాచలానికి చెందిన ఎస్‌వీ హెచ్ సుబ్బారావు పాట దక్కించుకున్నారు. గతంలో ఇదే టెండర్ రూ.39,05,000 పలికింది. విస్తా కాంప్లెక్స్‌లో కూల్ డ్రింక్స్ షాపు, మరో ఐదు దుకాణాలకు కూడా టెండర్లను ఖరారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment