పెల్లుబికిన ఆగ్రహం
గ్రామసభల్లో కొత్తగా వచ్చిన దరఖాస్తులు
బూర్గంపాడు/చుంచుపల్లి/టేకులపల్లి: సంక్షేమ పథకాల గ్రామసభలు గందరగోళం నడుమ ముగిశాయి. పలుచోట్ల జాబితాల్లో అర్హుల పేర్లు రాకుండా అనర్హుల పేర్లు రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ పథకాలను అందించేందుకు జిల్లాలోని లోని 481 గ్రామపంచాయతీలు, 103 మున్సిపల్ వార్డుల్లో ఈ నెల 21 నుంచి శుక్రవారం వరకు సభలను జరిపారు. మొదటిరోజు నుంచి చివరి రోజు వరకు సభల్లో నిరసనే ఎదురైంది. పలుచోట్ల సభలు రసాభాస మారాయి. ఎక్కువ శాతం నిరుపేదలకు న్యాయం జరగలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అర్హుల ఎంపికలో పైరవీలకే ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. జాబితాలో పేర్లు రానివారు తిరిగి దరఖాస్తులు చేసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా నాలుగు పథకాల కోసం 1,00,494 దరఖాస్తులు అందాయి. కొత్తగా వచ్చిన దరఖాస్తులను వారం రోజుల్లో పున పరిశీలన చేసిన అనంతరం పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా లబ్ధిదారుల జాబితాను రాష్ట్రస్థాయిలోనే ఎంపిక చేసి జిల్లాలకు పంపించినట్లు తెలిసింది. దేనిని ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారుల ఎంపిక చేశారో తెలియని పరిస్థితి నెలకొంది.
టేకులపల్లిలో రసాభాస
టేకులపల్లి మండలంలో శుక్రవారం టేకులపల్లి, దాసుతండా, తడికలపూడి, సులానగర్, కోయగూడెం, కొప్పురాయి, మేళ్ళమడుగు, చింతోనిచెలక, గంగారం పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. టేకులపల్లి సభ రసాభాసగా మారింది. ఎంపీడీవో రవీంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ ప్రారంభంకాగానే బీఆర్‌ఎస్ నాయకులు ఆమెడ రేణుక, భూక్య లాలునాయక్ మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీలు ఏ ప్రాతిపదికన నియమించారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కలుగజేసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు బీఆర్‌ఎస్ నాయకులను సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం సభలో గ్రామంచాయతీ కార్యదర్శి దీప్తి ఇందిరమ్మ ఇళ్ల జాబితా చదువుతుండగా, అర్హుల పేర్లు రాలేదంటూ బీఆర్‌ఎస్ నాయకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపోద్రిక్తులైన ప్రజలు కుర్చీలు పడేశారు. ఓ మహిళ చేయి చేసుకోవడంతో కార్యదర్శికి కంటి వద్ద స్వల్ప గాయమైంది. దీంతో పోలీసులు, పంచాయతీ సిబ్బంది ఎంపీడీఓ, కార్యదర్శిని కార్యాలయంలోకి పంపించి, తలుపులు మూసివేశారు. ఆందోళనకారులు కార్యాలయంలోకి కూడా వెళ్లేందుకు ప్రయత్నించగా సీఐ సురేష్ తదితరులు పరిస్థితిని అదుపు చేశారు. కాగా తన విధులకు ఆటంకం కలిగించారని, తన పై దాడిచేసి కులం పేరుతో దూషించారని టేకులపల్లి కార్యదర్శి ఉప్పు దీప్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రేషన్‌కార్డులు 34,083
రేషన్‌కార్డుల్లో మార్పులు 11,249
ఇందిరమ్మ ఇళ్లు 38,369
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 15,672
రైతు భరోసా 1,121
నిరసనలు, నిలదీతల నడుమ
ముగిసిన గ్రామసభలు
ఇందిరమ్మ ఇళ్ల జాబితాల్లో
అనర్హుల పేర్లే ఎక్కువ వచ్చాయని ఆరోపణలు
ప్రజలకు సమాధానం చెప్పలేక
మిన్నకుండిన అధికారులు
సభకు హాజరైన ప్రజలారా..!
20మంది లేకున్నా మాట్లాడి వెళ్లిన ఎమ్మెల్యే
అశ్వారావుపేట: అశ్వారావుపేట మేజర్ పంచాయతీలో శుక్రవారం ప్రభుత్వ సంక్షేమ పథకాల గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు ఉదయం 8–30 గంటలకే ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేరుకోగా.. అప్పటికి పదిహేను మంది లోపు ప్రజలు ఉండగా అధికారులెవరూ రాలేదు. ఎమ్మెల్యే వచ్చిన విషయం తెలియగానే తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఎంపీడీఓ ప్రవీణ్ చేరుకున్నారు. దీంతో ఉన్న కొద్దిమందిని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడి వెనుదిరిగారు. ఈ విషయమై తహసీల్దార్‌ను సంప్రదించగా బస్టాండ్‌లో స్వచ్ఛ ఆర్టీసీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఆపై గ్రామసభకు వచ్చారని.. దీంతో తాము చేరుకోలేకపోయామని తెలిపారు. ఇంకొన్ని సభలకు హాజరుకావాల్సి ఉండడంతో వెళ్లిపోయారని చెప్పారు. కాగా, అశ్వారావుపేటలో సమస్యలపై ప్రజలు, ప్రతిపక్షాల నేతలు నిలదీసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుండగా.. ఈ కారణంతోనే ఎమ్మెల్యే వెళ్లిపోయారని వివిధ పార్టీల నాయకులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment