ప్రకృతి అందాలతో మనసు దోచే కిన్నెరసాని
● అపురూప ఆలయాలు, చారిత్రక కట్టడాలు ● ఆకర్షిస్తున్న ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు ● నేడు జాతీయ పర్యాటక దినోత్సవం
కిన్నెరసాని రిజర్వాయర్
ఖమ్మం ఖిల్లా
భద్రాచలంలోని
శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం
ప్రకృతితో పెనవేసుకున్న ప్రదేశాలు.. ఎత్తయిన కొండలు, గుట్టలు.. పచ్చని చెట్లు, పారేటి సెలయేర్లు.. ఆధ్యాత్మికం పరిఢవిల్లే ఆలయాలు, చారిత్రక కట్టడాలు.. ఉమ్మడి జిల్లాకు పర్యాటక శోభ తెచ్చిపెడుతున్నాయి. పర్యాటకులకు కనువిందు చేస్తూ, ప్రకృతి రమణీయతను చాటుతున్నాయి. ఇక తీగల వంతెన, హోటళ్లు, వసతి గృహాలు నిర్మిస్తే పర్యాటకాభివృద్ధితోపాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుంది. నేడు జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. – పాల్వంచరూరల్
ఎత్తయిన కొండలు, గుట్టలు, జలాశయం మధ్య చూడచక్కని హైలాండ్స్, పచ్చని పచ్చిక బయళ్లు, వృక్షాలు కిన్నెరసాని సొంతం. పెద్దమ్మతల్లి గుడి, నవభారత్ వేంకటేశ్వరస్వామి ఆలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం, పర్ణశాల వంటి ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి 24 కిలోమీటర్ల దూరంలో కిన్నెరసాని ఉంది. ఇక్కడ కిన్నెరసాని జలాశయం, అందులో రెండు ద్వీపాలు, బోటుషికారు, చుక్కల దుప్పులు కలిగిన డీర్‌పార్కు, అద్దాల మేడ, కాటేజీలు ఉన్నాయి. ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు కిన్నెరసానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వచ్చిపోతుంటారు. వీరి కోసం ప్రత్యేక కుటీరాలను నిర్మించారు. ప్రభుత్వం 2015లో నీతి అయోగ్ పథకం కింద కేంద్రం ద్వారా రూ.3.24 కోట్లు, ఎకో టూరిజం అభివృద్ధి కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.7.53 కోట్లు మంజూరు చేసింది. ఆయా నిధులతో కొత్తగూడెం క్రాస్ రోడ్డు వద్ద చేపట్టిన హరిత హోటల్ వచ్చే ఫిబ్రవరి 20 నాటికి పూర్తి కానుంది. కిన్నెరసానిలో పది కాటేజీలు, అద్దాల మేడ, ఫుడ్ కోర్టు పనులు నిర్మాణ పూర్తి కాగా, నిర్వహణ బాధ్యతలను ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు టూరిజం శాఖ అప్పగించనుంది. వచ్చే నెలలో ఇవి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి.
ఇంకా కొన్ని చేస్తే..
ఉమ్మడి వరంగల్ జిల్లా లక్నవరంలో ఏర్పాటు చేసినట్లు కిన్నెరసానిలో కూడా జలాశయంలోని నీళ్ల మధ్య ఉన్న రెండు హైలాండ్స్ నడుమ వంతెనను ఏర్పాటు చేసి, ప్రత్యేక హోటళ్లను, వసతి గృహాలను నిర్మించాలి. అప్పుడే కిన్నెరసానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. కనీసం బస్ సౌకర్యం కూడా లేకపోవడంతో ఆటోల్లో వారు అడిగినంత ఇచ్చి వెళ్లాల్సి వస్తోంది. ఈ విషయాలపై దృష్టి సారించి అధికారులు మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంది.
●వేంకటేశ్వరస్వామి ఆలయం
జిల్లా కేంద్రానికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోని కలెక్టర్ కార్యాలయం పక్కన గుట్టపై నవభారత్ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి భక్తులు ప్రతి శనివారం అధిక సంఖ్యలో వస్తుంటారు.
●పెద్దమ్మతల్లి ఆలయం
భద్రాచలం వైపు వెళ్లే మార్గంలో జాతీయ రహదారి పక్కన పాల్వంచకు నాలుగు కిలోమీటర్ల దూరంలో జగన్నాథపురం వద్ద పెద్దమ్మతల్లి ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఆది, గురు, శుక్రవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అన్నపురెడ్డిపల్లిలో కాకతీయుల కాలంలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇది భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. స్తంభాలు, గోడలపై చెక్కిన శిల్పాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
●శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం
జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం ఉంది. దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఒక్కటిగా ఉంది. గోదావరి తీరం వెంట రామాయణం కాలం నాటి ఘట్టాల ఆనవాళ్లు, బాపు బొమ్మలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. భద్రాచలానికి 36 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉన్న పర్ణశాల ఆలయం ఉంది. రామాయణం కాలం నాటి ఘట్టాల ఆనవాళ్లు, రాముడు సతీసమేతంగా వనవాసం చేస్తూ ఈ అడవుల్లోనే ఉన్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది.
ఖమ్మం జిల్లాలో..
●ఖమ్మం జిల్లాలోని జమలాపురంలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. భక్తుల రద్దీతో కళకళాడుతోంది. కూసుమంచిలో కాకతీయులు నిర్మించిన శివాలయం, విశ్రాంతి భవనం ఉన్నాయి. నేలకొండపల్లిలో వంద ఎకరాల విస్తీర్ణంలో మట్టితో నిర్మించిన చారిత్రక బౌద్ధస్తూపం, మజ్జుగూడెంలో బౌద్ధులు నాడు నిర్మించిన స్తూపాలు, గృహాలున్నాయి. ఖమ్మం పట్టణంలో చారిత్రక కట్టడం స్తంభాద్రి ఖిల్లా, లకారం చెరువు ఉన్నాయి. లకారం చెరువుపై రూ.8 కోట్లతో నిర్మించిన సెన్సార్ బ్రిడ్జీ ఆకట్టుకుంటోంది. వైరా జలాశయానికి సైతం పర్యాటకులు వస్తున్నారు.
కిన్నెరసానిలోని జింకల పార్కు
Comments
Please login to add a commentAdd a comment