సాక్షి, బెంగళూరు: అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా దేశంలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది. కర్నాటకలో టెస్లా తన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా తరువాత, టెస్లా రెండవ రీసెర్చ్ సెంటర్ ను బెంగళూరులో ఏర్పాటు చేయనుంది. ఈమేరకు ఎలోన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ఈ నెల ప్రారంభంలో అధికారులతో ప్రాథమిక చర్చలు చేపట్టిందని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఈ నెల చివర్లో మరో సమావేశం జరగనుందని దీనిలో ప్రభుత్వ అధికారులు టెస్లాకు ఒక ప్రతిపాదనను సమర్పించే అవకాశం ఉంది.
లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాలు త్వరలోను భారతదేశంలో లభ్యం కానున్నాయని టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ జూలైలో సంకేతాలందించారు. చైనా తరువాత ఆసియాలో ఒక గిగా ఫ్యాక్టరీ, కారు, బ్యాటరీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. అయితే దీనికి ముందు గిగా బెర్లిన్, అమెరికాలో రెండవ గిగా ఫ్యాక్టరీని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జనవరిలో చైనాలో గిగా ఫ్యాక్టరీని ప్రారంభించింది ఈ ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో చైనాలో 50 వేల వాహనాలను విక్రయించింది. దీంతో బెంగళూరులో కొత్త సెంటరు ఏర్పాటుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా కాలుష్య ఉద్గారాలు, కొత్త నిబంధనల ప్రకారం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరగనుంది. ఈ మేరకు ఎలక్ట్రిక్వాహనాల మార్కెట్‌ను విస్తరించాలని ఆటో పరిశ్రమ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో 2025 నాటికి ఈ మార్కెట్ రూ .50 వేల కోట్లను తాకే అవకాశం ఉందని అంచనా. మహీంద్రా ఎలక్ట్రిక్, డైమ్లెర్, బాష్ సహా గ్లోబల్, లోకల్ ఈవీ కంపెనీలకు బెంగళూరు హాట్ స్పాట్ గా ఉంది. ఓలా ఎలక్ట్రిక్, సన్ మొబిలిటీ ఈథర్కూడా కర్ణాటకకు చెందినవే కావడం గమనార్హం. అలాగే దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అమలును ప్రకటించిన మొదటి రాష్ట్రం కూడా ఇదే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment