కూటమి ప్రభుత్వానికి సమస్యలు పట్టవా?
చిత్తూరు కలెక్టరేట్ : గత సార్వత్రిక ఎన్నికల్లో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద శనివారం ఆ సంఘం నాయకులు ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రూ.3,580 కోట్లు వెంటనే మంజూరు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో విద్యార్థుల సమస్యలు కనిపించవా ? అని ప్రశ్నించారు. జీఓ నంబర్ 77 రద్దు చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్, ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతవిద్య చదివే విద్యార్థులకు గతంలో నాలుగు విడతల్లో మంజూరు చేసేవారన్నారు. చాలా కళాశాలల్లో ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ధర్నాలో సంఘ నాయకులు మున్నా, భరత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment