కొత్తగా.. మొదలయ్యేనా..
కొత్త సంవత్సరం.. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మార్పు రావాలని ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. ఆ మేరకు మొదటి రోజు నుంచే ప్రయత్నాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కొత్త ఏడాదిలో అయినా మంచి జరగకపోతుందా అని కోటి ఆశలతో అన్నివర్గాల వారు ఆశిస్తున్నారు. అయితే ఆశలు ఫలించాలంటే ప్రభుత్వ తోడ్పాటు ఉండాలి. కొత్త ఏడాదిలో అయినా కూటమి పాలకులకు కనువిప్పు కలిగి ఎన్నికల హామీలను నెరవేర్చడంతో పాటు వ్యవసాయ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
● ప్రభుత్వ కొలువులు సాధించడమే లక్ష్యంగా నిరుద్యోగులు ● ఉపాధి కల్పనకు పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపని ప్రభుత్వాలు ● పంటలు బాగా పండాలని రైతన్నల కోరిక ● ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తే బాగుండు ● పీఆర్సీ, అరియర్స్ అందాలని ఉద్యోగుల ఆరాటం ● కూటమి పాలకులకు కనువిప్పు కలిగి మంచి చేయాలని ఆశిస్తున్న జిల్లా ప్రజానీకం ● కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని ఆశిస్తున్న విభిన్న వర్గాల ప్రజలు
తిరుమల ఆలయం ముందు భక్తుల నూతన సంవత్సర సందడి
కాణిపాకం : కొత్త ఏడాదిలో తమ జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని కోటి ఆశలతో 2025 సంవత్సరంలోకి అడుగిడుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి పాలకులకు కొత్త సంవత్సరంలో కనువిప్పు కలిగి వ్యవసాయానికి అండగా నిలవాలని అన్నదాతలు కోరుతున్నారు. ముఖ్యంగా బీడు భూములు పచ్చని పంట పొలాలుగా మారాలని రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పంటలసాగుకు అవసరమైన నీటి వసతి ఉన్నా.. పెట్టుబడి సాయం వేధిస్తోంది. దీనికితోడు నకిలీ ఎరువులు, పురుగు మందుల కారణంగా రైతుల చేతికి ఫలం అందడం లేదు. ఈ కష్టాలను అధిగమించేలా రైతులు అడుగులు వేయాలని ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పన విషయంలో నిర్లక్ష్యం చూపుతున్న పాలకులు ఇక నుంచైనా మంచి చేస్తారనే ఆశతో చాలామంది నిరుద్యోగులు వేచి చూస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నా.. ప్రభుత్వ కొలువు సాధించాలన్న లక్ష్యంతో కోచింగ్ సెంటర్లలో కుస్తీ పడుతున్నారు. అలాగే ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న తమకు ఆరియర్స్, పీఆర్‌సీ కల నెరువేరుతుందనే ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఉన్నారు. మహిళలు ఆర్థిక చేయూత కోసం ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంతో పాటు చేయూత అందిస్తే అన్ని వర్గాలతో పాటు వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు వేలమంది ఎదురు చూస్తున్నారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు నిర్మించే వారికి రాయితీ రుణాలు విరివిగా అందిస్తే.. వారు పలువురికి ఉపాధి అవకాశాలు అందించే దిశగా ఆశావహులు అడుగులు వేస్తున్నారు. విద్యారంగంలో పేద విద్యార్థులకు ప్రభుత్వ సాయం, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ కలలు ఈ ఏడాదిలో నెరవేరితే నూతన వెలుగులు ఉంటాయని పలువురు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment