బాధితులకు అండగా దళిత సంఘాలు
నగరి: మండలంలోని తడుకు దళితవాడలోని బాధిత దళితులకు పలు దళిత సంఘాలు అండగా నిలిచాయి. ఆదివారం సాయంత్రం ఆల్‌ఇండియా అంబేడ్కర్ అసోసియేషన్, బీఎస్‌పీ, బీపీఎఫ్, వీజీకే, నీలం పన్బాట్టుమయ్యం, బీపీఎఫ్, ఏపీఎల్‌ఎఫ్, అంబేడ్కర్ ఆర్మీ, న్యాయవాదుల సంఘం, తిరుపతి అంబేడ్కర్ భవన్ నేతలు, తిరుమల ఉద్యోగుల సంఘనేతలు అంటూ మన రాష్ట్రంతో పాటు, తమిళనాడు నుంచి పలువురు తడుకు దళితవాడకు విచ్చేశారు. బాధితులను పరామర్శించారు. గొడవ జరిగిన విధానంపై ఆరాతీశారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ దళితులపై జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నామన్నారు. దళితులపై దాడులు పెరుగుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నిరసన తెలిపారు. దెబ్బలు తిన్న దళితులను రిమాండ్‌కు పంపి దాడి చేసిన వారికి రక్షణ కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకులస్తులను పరామర్శించిన ఎమ్మెల్యే, గాయపడిన దళితులను ఎందుకు పరామర్శించలేదన్నారు. దీనిపై అధికార పార్టీలో ఉన్న దళితులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. దళితులకు న్యాయం జరగాలంటే ఐక్య పోరాటం తప్పదన్నారు. మిగిలిన సంఘాలను ఏకం చేసుకొని న్యాయం కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. అనంతరం దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత దళితుల తరపున వైస్‌ఎంపీపీ కన్నియప్ప డీఎస్పీ సాయినాథ్, సీఐ మహేశ్వర్‌కు మరోమారు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ భవన్ చైర్మన్ పరమశివం, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగ సంఘ అధ్యక్షులు ప్రసాద్ రావు, అంబేడ్కర్ ఆర్మీ ఫౌండర్ ఈ గోపి, వీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొకం రమేష్, నగరి నియోజకవర్గ కన్వీనర్ ఎం.బాబు, బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగూర్, ఎస్‌ఎస్‌డి చిరంజీవి, ఏపీఎల్‌ఎఫ్ నాయకుడు శేఖర్, నీలం పన్బాట్టుమయ్యం నాయకులు వైల్‌స్వామి, రంగరాజు, సెల్వం, మున్సిపల్ వైస్ చైర్మన్ బాలన్, న్యాయవాదుల సంఘం నాయకులు బాబు, నాగరాజు, ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.
● నిందితులకు రక్షణగా పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment