నూతన ఏడాదిలో మొదటి గ్రీవెన్స్ రద్దు
చిత్తూరు కలెక్టరేట్ : నూతన ఏడాదిలో మొదటి గ్రీవెన్స్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)ను అధికారులు రద్దు చేశారు. సీఎం చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు వస్తున్నందున కలెక్టరేట్‌లో ఈ నెల 6వ తేదీన నిర్వహించాల్సిన గ్రీవెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ ప్రకటించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కాకపోవడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు నూతన సంవత్సరంలో మొదటి గ్రీవెన్స్‌ను రద్దు చేయడంపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.
సీఎం పర్యటనకు
సర్వం సిద్ధం
కుప్పం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం అధికారులు సర్వం సిద్ధం చేశారు. సీఎం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ద్రావిడ విశ్వవిద్యాలయంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుని పర్యటనను ప్రారంభిస్తారు. రెండు రోజుల పాటు జరిగే అధికారుల సమీక్ష సమావేశం, వివిధ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశాలు, శంకు స్థాపనలు వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. దీంతో పాటు కుప్పం మండలం చీగలపల్లి వద్ద ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించనున్నారు. ఎన్‌టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభ, కుప్పం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. కంగుంది గ్రామంలో సీనియర్ టీడీపీ నేత పీఎస్ మునిరత్న తండ్రి విగ్రహావిష్కరణ, అనంతరం మహిళలతో ముఖాముఖి కార్యక్రమాలకు సిద్ధం చేశారు. నడుమూరు వద్ద పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ పథకాన్ని ప్రారంభించనున్నారు.
గుడిమల్లంలో పురావస్తు శాఖ అధికారుల పరిశీలన
రేణిగుంట(ఏర్పేడు): ఏర్పేడు మండలంలోని గుడిమల్లం పరశురామేశ్వరాలయాన్ని ఆదివారం పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపురాతన శైవక్షేత్రమైన ఈ ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి ప్రతిపాదనలను సిద్ధం చేయనున్నట్లు పురావస్తుశాఖ సౌత్‌జోన్ రీజనల్ డైరెక్టర్ ఎన్‌కే పతాక్ తెలిపారు. ఆలయ ప్రతిష్ట, ప్రాశస్త్యం భక్తులకు మరింత చేరువయ్యే దిశగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు అడుగులు వేస్తున్నట్లు వివరించారు. ఆలయ మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు, ఈఓ రామచంద్రారెడ్డి వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి శాలువాలతో సత్కరించారు. సూపరింటెండెంట్ గోపీనాథ్, సీఐ బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment