నీటితో నిండి ఉన్న అడవికొత్తూరు రిజర్వాయరు
గాలేరు–నగరి గమ్యం చేరేనా?
36 ఏళ్లుగా నీటికి తప్పని నిరీక్షణ
బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా కానరాని ఫలితం
2019కే గాలేరు నగరి పూర్తి చేస్తామన్న అప్పటి సీఎం చంద్రబాబు
పడకేసిన ప్రాజెక్టుకు వైఎస్సార్‌సీపీ పాలనలో ఊపిరి
అవుకు వద్ద రెండు టన్నెళ్లు ప్రారంభం
ప్రస్తుతం బడ్జెట్‌లో రూ.2,254 కోట్లు కేటాయింపు
నిధులు కేటాయించినా కనిపించని స్పందన
రాయలసీమలోని క్షామపీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన గాలేరు–నగరి ప్రాజెక్టు 36 ఏళ్లుగా ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎక్కువ శాతం పూర్తయిన పనులు తదనంతర పాలకుల నిర్లక్ష్యంతో ముందుకు సాగలేదు. నాడు కళకళలాడిన నీటి కాలువలు నేడు ముళ్లకంపలతో అడవిని తలపిస్తున్నాయి.
2019 నాటికి గాలేరు–నగరి ద్వారా నీరందిస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం దాన్ని విస్మరించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 5,036 కోట్లు కేటాయించి, అవుకు వద్ద రెండు టన్నెళ్లు ప్రారంభించింది. అయితే ప్రస్తుత బడ్జెట్‌లో రూ.2,254 కేటాయించినట్లు ప్రభుత్వం చూపినా ఇప్పటివరకు ప్రాజెక్టు సందర్శన కూడా జరగలేదు. నిధులు కాగితాలకే పరిమితమైతే జిల్లాలోని తూర్పు ప్రాంతాలకు కల్పతరువుగా భావిస్తున్న ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకమే.
ఊపిరి పోసిన జగన్ ప్రభుత్వం
చతికిలబడిన ప్రాజెక్టుకు గత జగన్ ప్రభుత్వం ఊపిరి పోసింది. 2020, ఆగస్టు 27న రూ.5,036 కోట్లు గాలేరు నగరి నుంచి హంద్రీనీవాకు ఎత్తిపోతల పథకానికి మంజూరు చేసింది. 2023 నవంబరు 30న ఈ ప్రాజెక్టులో భాగంగా అవుకు వద్ద నిర్మించిన రెండు టన్నెళ్లను ప్రారంభించింది. దీంతో ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో ఆశలు చిగురించాయి.
నగరి: రేణిగుంట సమీపంలోని కరకంబాడి వద్ద గాలే రు–నగరి ప్రాజెక్టుకు 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారు. కాలువ నిర్మాణానికి రూ.1,200 ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించారు. పనుల్లో వేగం లేక ఆగిపోయింది. ఉనికి కోల్పోయిన ఈ ప్రాజెక్టుకు 2004 జూన్ 4న మహానేత వైఎస్సార్ ఊపిరి పోసి మళ్లీ శంకుస్థాపన చేశారు. గాలేరు–నగరి ప్రాజెక్టుకు కొత్త అంచనాలు తయారు చేశారు. రూ.2,189 కోట్ల ప్రాథమిక అంచనాతో పనులు ప్రారంభమయ్యాయి. శ్రీశైలం మిగులు జలాలను పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ నుంచి గాలేరు– నగరి కాలువకు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రాజెక్టులో భాగంగా పది రిజర్వాయర్లు నిర్మించదలిచారు. పనులు కూడా వేగంగా జరిగాయి. అయితే మహానేత మరణం ప్రాజెక్టు పాలిట శాపంగా మారింది. తదుపరి వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. 2019లో ప్రాజెక్టు పూర్తిచేసి నీరందిస్తామన్న టీడీపీ ప్రభుత్వం మాటతప్పింది. ప్రాంతాలు ముళ్లకంపలు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది.
నమూనాలో మార్పులు
ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కొండల తవ్వకాలు, అడవీ భూముల అనుమతులు అంటూ పలు సమస్యలు ఎదురవ్వడంతో నమూనాలో మార్పులు చోటుచేసుకున్నాయి. నిధులు సకాలంలో విడుదల కాకపోవడం, మరోవైపు కాలం దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోతుండడం, చేపట్టిన పనులే మళ్లీ చేయాల్సి రావడం, డిజైన్ల మార్పు ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచేసింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రిజర్వాయర్ల వివరాలు
రిజర్వాయర్; సామర్థ్యం; ఆయకట్టు
మల్లెమడుగు రిజర్వాయర్; 2.650 టీఎంసీ; 55వేల ఎకరాలు
పద్మసాగర్ రిజర్వాయర్; 0.45 టీఎంసీ; 5 వేల ఎకరాలు
శ్రీనివాస సాగర్ రిజర్వాయర్; 0.448 టీఎంసీ; 4,200 ఎకరాలు
వేణుగోపాలసాగర్ రిజర్వాయర్; 2.683 టీఎంసీ; 28,800 ఎకరాలు
వేపగుంట రిజర్వాయర్; 0.533 టీఎంసీ; 5వేల ఎకరాలు
అడవికొత్తూరు రిజర్వాయర్; 1 టీఎంసీ; 10 వేల ఎకరాలు
బాలాజీ రిజర్వాయర్; (3 టీఎంసీలు–ఇందులో 1 టీఎంసీ తాగునీరు)
● అడవిలా రిజర్వాయర్
ఒకప్పుడు పనులు జరుగుతూ కళకళలాడిన రిజర్వాయరు ప్రాంతం ఇప్పుడు అడవిలా తయారైంది. 30 యేళ్లుగా ఎదురుచూస్తున్నా ఎప్పటికి అవుతుందో తెలియడం లేదు. ప్రాజెక్టు ప్రాంతంలో ఆవులు, గొర్రెలు మేపుకుంటున్నారు. కాలువల్లో ఉన్న నీరంతా పాచిపట్టి నిరుపయోగంగా ఉంది. ప్రాజెక్టు పూర్తయివుంటే ఈ ప్రాంతంలోని వ్యవ సాయ భూముల విలువ కూడా పెరిగి ఉండేది.
– రామిరెడ్డి, రైతు, అడవికొత్తూరు
నిరీక్షణ తప్పలేదు
ప్రారంభ దశలో పనుల వేగం చూసి చాలా ఆనందపడ్డాం. కృష్ణాజలాలు నగరికి వస్తాయని ఇక తాగు, సాగునీటికి ఎలాంటి డోకా ఉండదని అనుకున్నాం. ఆ ఆశలు అడియాశలు అవుతూనే ఉన్నాయి. నేడు తాగడానికి స్వచ్ఛమైన నీరులేని పరిస్థితి. ప్రస్తుతం ఈ ప్రభుత్వం కేటాయించిన నిధులతోనైనా పనులు పూర్తవుతాయా? లేక అందని ద్రాక్షగానే మిగిలిపోతుందా అన్నది తెలియడం లేదు.
– బాబు, ప్రైవేటు ఉద్యోగి, నగరి
బడ్జెట్‌లో రూ.2,254 కోట్లు కేటాయింపు
ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్‌లో గాలేరు నగరి ప్రాజెక్టుకు రూ.2,254 కోట్లు కేటాయించింది. అయితే ఇప్పటివరకు పర్యవేక్షణ చేపట్టలేదు. టెండర్లు పిలిచినా ఆ పనులు 12 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ప్రాజెక్టు ఉన్న పరిస్థితుల్లో ఇది అసాధ్యమే. ఈ నిధులు కాగితాలకే పరిమితంకాక కార్యరూపం దాలిస్తే ప్రాజెక్టుకు చలనం వచ్చే అవకాశం ఉంది. లేకుంటే మళ్లీ ప్రాజెక్టు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment