చిత్తూరు మండలంలో కొబ్బరి చెట్టుపై గీత కార్మికుడు
కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాలేవీ..?
జిల్లాలో ఇప్పటికే 104 ప్రైవేటు మద్యం దుకాణాలు
10 శాతం దుకాణాలు గీత కార్మికులకేనంటూ హామీ
దుకాణాల ఎక్కడనే అంశంపై ఇంకా తేల్చని సర్కారు
ప్రైవేటు మద్యంతో తమ్ముళ్ల గల్లాపెట్టెలు కళకళ!
‘గీత’ దాటనిస్తారా..? అంటూ కార్మికుల అనుమానాలు?
తమ్ముళ్లూ మేం అధికారంలోకి వస్తే గీత కార్మికుల రాత మారుస్తాం.. కొత్త మద్యం పాలసీలో పది శాతం దుకాణాలు మీకు కేటాయిస్తాం.. ఇదీ నాడు ఎన్నికల్లో బాబు ఊరూరా ఇచ్చిన హమీ.. నేడు అధికారంలోకి వచ్చాక.. ఆ మాటే మరిచా రు. కొత్త మద్యం పాలసీ వచ్చింది. తెలుగు తమ్ముళ్లు పంచుకున్నారు. ఆదాయం అర్జిస్తున్నారు. అయితే గీత కార్మికులకు దుకాణాల కేటాయింపు మాత్రం అటకెక్కింది.
చిత్తూరు అర్బన్: కూటమి నేతలు కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్ అంశాన్ని గాలికి వదిలేశారు. అలాగని అసలు మద్యం దుకాణాలే పెట్టలేదా అంటే.. బ్రహ్మాండంగా కూటమి నేతలకు ఉపాధి చూపించి రూ.వందల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వెళుతోంది. పాపం గీత కార్మికులే తమ రాత మారుతుందా..? లేదా ..? అని గంపడాశలతో ఎదురుచూస్తున్నారు.
హామీ గుర్తుందా..?
కూటమి నేతలు విడుదల చేసిన మ్యానిఫెస్టోను చూస్తే, అసలు ప్రజలకు ఇచ్చిన వరాలు ఎప్పుడు తీరుస్తారనే ప్రశ్న సామాన్యుడికి సైతం కలుగుతుంది. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా కూటమి సర్కారు మ్యానిఫెస్టో కనిపిస్తుంది. ఇందులో కల్లుగీత కార్మికులను సైతం వదల్లేదు. తాము అధికారంలోకి వస్తే ఏర్పాటు చేయనున్న మద్యం దుకాణాల్లో 10 శాతం షాపులను కల్లుగీత కార్మికులకు రిజర్వు చేస్తామని హామీ గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రైవేటు మద్యం దుకాణాలు తెరిచేశారు. అక్టోబర్ 15వ తేదీన తెరిచిన మద్యం దుకాణాల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. దరఖాస్తుల విక్రయాలు, నాన్ రీ–ఫండబుల్ డిపాజిట్లు, త్రైమాసిక లైసెన్సు ఫీజుల రూపంలో రూ.110 కోట్లు, ఇప్పటి వరకు అమ్ముడైన మద్యం ద్వారా రూ.120 కోట్లు.. వెరసి మొత్తంగా దాదాపు రూ.230 కోట్ల వరకు సంపాదన ఆర్జించింది. మొన్నటికి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో ప్రీమియం మద్యం అవుట్‌లెట్ల కోసం నోటిఫికేషన్ కూడా ఇచ్చిన ప్రభుత్వానికి కల్లుగీత కార్మికులకు దుకాణాలు ఇస్తామన్న హామీ మాత్రం గుర్తుకు రాలేదు.
వాళ్లు బాగుంటే చాలా..?
మద్యం దుకాణాలను దక్కించుకున్నవారిలో 90 శాతం మంది టీడీపీకి చెందిన వాళ్లే. పైగా లైసెన్సులు తీసుకున్న వాళ్ల నుంచి ప్రతి నియోజకవర్గంలోని కూటమి పార్టీకి చెందిన ప్రధాన నాయకులకు వాటాలు తప్పనిసరిగా అందుతున్నాయి. దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు, వాటాలు తీసుకుంటున్న నాయకులు అందరూ బాగున్నారు.. కానీ కల్లుగీత కార్మికుల బాగోలు పట్టించుకునే దిక్కులేదు.
ఆలోచన ఉందా..
జిల్లాలో 104 మద్యం దుకాణాలకు ప్రభుత్వం లైసెన్సులను మంజూరు చేసింది. మ్యానిఫెస్టో ప్రకారం గీత కార్మికులకు 10 శాతం దుకాణాలు ఇవ్వాలి. అంటే ఆ లెక్కన జిల్లాలోని కల్లుగీత కార్మికులకు 14 దుకాణాలు కేటాయించాలి. ప్రైవేటు దుకాణాల కేటాయింపునకు తీసుకున్నట్లు ఒక్కో దరఖాస్తు కోసం రూ.2 లక్షలు నాన్–రీఫండబుల్ తీసుకుంటారా..? లైసెన్సు ఫీజు రూ.55 లక్షలు నుంచి రూ.65 లక్షల మధ్యలో ఉంచుతారా..? ఏమైనా తగ్గిస్తారా..? అనే ప్రశ్నలకు ఇప్పటి వరకు ఎవరి వద్దా ఎలాంటి సమాధానాలు లేవు. ప్రైవేటు మద్యం దుకాణాలకు ఇచ్చిన రెండేళ్ల లైసెన్సు కాలపరిమితిలో ఇప్పటికే మూడు నెలలు కావస్తోంది. అంటే గీత కార్మికులు ఈ మూడు నెలల ఆదాయం కోల్పోయినట్లే అవుతుంది. అసలు నోటిఫికేషన్ ఎప్పుడిస్తారు..? ఇస్తే కనుక క్షేత్రస్థాయిలో నిజమైన గీత కార్మికులకు దుకాణాలు ఇస్తారా..? లేదా ఆ ముసుగులో ఉన్న టీడీపీ కార్యకర్తలకు దుకాణాలు అప్పజెబుతారా? అన్న అంశం అర్థం కావడంలేదని పలువురు గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment