ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటే కీలకం
● చిత్తూరు ర్యాలీ, మానవహారం ● పాల్గొన్న జిల్లా జడ్జి భీమారావు, జేసీ విద్యాధరి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటే కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడ నుంచి నాగయ్య కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జాయింట్ కలెక్టర్ విద్యాధరి జెండా ఊపి ప్రారంభించారు. నాగయ్యకళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు మాట్లాడుతూ దేశ పౌరులు తమ ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించుకోవాలని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు, ఓటుహక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ప్రతి ఓటరూ తమ విలువైన ఓటును వినియోగించుకునే సమయంలో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. ట్రైనీ కలెక్టర్ హిమవంశీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవితంలో ఓటుహక్కు వినియోగించుకోవడం అదృష్టంగా భావించాలని చెప్పారు. డీఆర్వో మోహన్‌కుమార్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఏర్పాటై ఇప్పటికి 75 సంవత్సరాలు అయ్యాయని తెలిపారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరితో ఓటు హక్కు ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. యువ ఓటర్లకు ఎపిక్ కార్డులను అందజేశారు. సీనియర్ సిటిజన్ ఓటర్లకు దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి భరణి, ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ వాసుదేవన్, ఆర్డీఓ శ్రీనివాసులు, జిల్లా ఐకాన్, బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు నాగార్జున, చిత్తూరు అర్బన్, రూరల్, గుడిపాల తహసీల్దార్లు లోకేశ్వరి, కళావతి, చంద్రశేఖర్ రెడ్డి, చిత్తూరు డీవైఈఓ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment