చెక్కును అందజేస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి తదితరులు
మదనపల్లె(చిత్తూరు జిల్లా): కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదార్‌పురం రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన మేరకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను సోమవారం ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు నవాజ్‌బాషా, చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి సమక్షంలో అందజేశారు. కాగా, అజ్మీర్ యాత్ర కోసం మదనపల్లెలోని బాలాజీనగర్ నుంచి 18 మందితో టెంపో ట్రావెలర్‌లో బయల్దేరిన నౌజీరాబీ కుటుంబానికి చెందిన 14 మంది కర్నూలు జిల్లాలో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శవపరీక్షల అనంతరం అర్ధరాత్రి మృతదేహాలను మదనపల్లెకు తీసుకొచ్చారు. డ్రైవర్ నజీర్, అమీర్‌జాన్, దస్తగిరి, ఆయన భార్య అమ్మాజాన్, కూతుళ్లు సమిరిన్, అమిరిన్, రఫీ, మస్తానీ, జాఫర్‌వలీ, రోష్ని, నౌజీరాబీ, రిహాన్, నౌజియా, షఫీలకు వారి వారి స్వగ్రామాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి కూడా రూ.2 లక్షల సాయం
సాక్షి, న్యూఢిల్లీ: మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేయడానికి ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. ‘కర్నూలు జిల్లాలో దురదృష్టవశాత్తూ జరిగిన రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పీఎం జాతీయ సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తాం.’ అని ప్రధాని కార్యాలయం సోమవారం ట్వీట్ ద్వారా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment