సుప్రీంకోర్టులోనూ దక్కని ఉపశమనం  | Chandrababu Naidu Quash Petition Hearing In A.P. Skill Scam Case Adjourned - Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులోనూ దక్కని ఉపశమనం 

Published Wed, Oct 4 2023 3:01 AM | Last Updated on Wed, Oct 4 2023 9:21 AM

Chandrababu quash petition Hearing in skill case adjourned - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో నకిలీ ఒప్పందాలు చేసుకుని... షెల్‌ కంపెనీల్లోకి ప్రభుత్వ ధనాన్ని పంపించారు. వాటిని విత్‌డ్రా చేసుకుని తన జేబులో వేసుకున్నారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతూ ఆదాయపు పన్ను విభాగం నోటీసులిచ్చింది. ఆ నోటీసులు ఇచ్చే అధికారం మీకు లేదంటూ జవాబిచ్చారు చంద్రబాబు. ఆ డబ్బుల్ని మనీ లాండరింగ్‌ చేసిన వారిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు కూడా చేసింది.

ఇలా అన్ని వేళ్లూ సీఎం హోదా లో ఈ స్కామ్‌కు పాల్పడింది చంద్రబాబేనని చూపించాయి. పక్కా ఆధారాలతో సీఐడీ అరెస్టు చేసింది. ఆధారాలన్నీ చూపించటంతో కోర్టు జైలుకు పంపించింది.  చంద్రబాబు కుటుంబీకులేమో... ఆయనకు బోలెడంత డబ్బుందని, ఈ నేరం చెయ్యాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

ఆయన నిజంగా నేరం చెయ్యకపోతే ఆయన లాయర్లు కోర్టులో అదే విషయాన్ని చెప్పొచ్చు కదా? అదే వాదన వినిపించొచ్చు కదా? కానీ ఈ దేశంలోనే అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ చంద్రబాబు విషయంలో వాదిస్తున్నదేంటో తెలుసా? ఆయనకు దీంతో సంబంధం లేదనో, ఆయన నేరం చెయ్యలేదనో కాదు. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి కనుక ఆయన్ను అరెస్టు చేసే ముందు గవర్నరు అనుమతి తీసుకోవటం తప్పనిసరి అని... అలా తీసుకోలేదు కనక ఈ అరెస్టుతో పాటు ఆయనపై పెట్టిన కేసు కూడా చెల్లదని... కాబట్టి మొత్తం కేసునే కొట్టేయాలని వాదిస్తున్నారు.  

బుధవారం సుప్రీంకోర్టులో సైతం... చంద్రబాబు నేరం చేశారా? లేదా? అనే జోలికి తాము వెళ్లబోవటం లేదని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ ప్రకారం ఆయన అరెస్టు చెల్లదని మాత్రమే తమ వాదన వినిపిస్తున్నామని స్పష్టంచేశారు. విచిత్రమేంటంటే చంద్రబాబు నాయుడి తరఫున కాకలు తీరిన లాయర్లు సిద్ధార్థ లూత్రా, అభిషేక్‌ మను సింఘ్వీ, హరీష్‌ సాల్వే ముగ్గురూ వాదనలు వినిపించారు. ముగ్గురూ కూడా సెక్షన్‌ 17ఎ కింద గవర్నరు అనుమతి తీసుకోలేదు కనక కేసు చెల్లదని, క్వాష్‌ చేయాలని మాత్రమే వాదించారు.

దాదాపు 50 నిమిషాలసేపు జరిగిన విచారణలో... 90 శాతం సమయం ఈ చట్టం చంద్రబాబుకు వర్తిస్తుందా? లేదా? అన్న దానిపైనే సాగటం గమనార్హం. అయితే అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్‌ 17(ఏ)ను 2018లో సవరించడానికన్నా ముందు ఈ నేరం జరిగింది కనక ఆ సవరణ దీనికి ఎలా వర్తిస్తుందని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చివరకు దీనికి సంబంధించిన పత్రాలన్నీ సమర్పించాలని సీఐడీని ఆదేశిస్తూ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేయటంతో... చంద్రబాబుకు ఆశించిన ఉపశమనమైతే దొరకలేదు. 

చంద్రబాబు తరఫున ఎందరు వాదిస్తారు?: సుప్రీం 
స్కిల్‌ కుంభకోణానికి సంబంధించి తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్రిమినల్‌ ఎస్సెల్పీని మంగళవారం జస్టిస్‌ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ బేలా ఎం త్రివేదీతో కూడిన ధర్మాసనం విచారించింది. చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు ప్రారంభిస్తూ... పీసీ యాక్టులోని సెక్షన్‌ 17ఏను హైకోర్టు తప్పుగా అర్థం చేసుకుందన్నారు.

ఈ చట్టాన్ని ప్రజా ప్రతినిధులు అధికార విధులు నిర్వర్తించడంలో చేసే చర్యలకు సంబంధించినదిగా చూడాలన్నారు. ‘‘2018 జులై కన్నా ముందు జరిగిన నేరాలకు ఈ సెక్షన్‌ వర్తించదని హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం సరికాదు. ఎందుకంటే ఈ సెక్షన్‌ నేరం ఎప్పుడు జరిగిందనే అంశానికి సంబంధించినది కాదు. ఓ ప్రక్రియకు సంబంధించినది, విచారణ తేదీకి సంబంధించినది’’ అని వాదన వినిపించారు.

అందుకోసమే తమ క్లయింట్‌కు ఈ రక్షణ కావాలని కోర్టును కోరుతున్నామని సాల్వే చెప్పారు. కేసు విచారణ 2021, సెపె్టంబరు 7న ప్రారంభమైనట్లుగా అడిషనల్‌ డీజీపీ రాసిన లేఖ చెబుతోందన్నారు. కాబట్టి ఈ కేసులో సెక్షన్‌ 17ఏ ప్రకారం గవర్నర్‌ అనుమతి ఆమోదం లేకుండా విచారణ చేయొచ్చా? అని సందేహం వ్యక్తంచేశారు.

ఈ దశలో జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ జోక్యం చేసుకొని ‘అంటే విచారణ ప్రారంభమైన తేదీని పరిగణించాలన్నది మీ ఉద్దేశమా?’ అని సాల్వేను ప్రశ్నించారు. చట్టం తీసుకొచ్చిన వాళ్లు చెప్పిందదేనని సాల్వే బదులిచ్చారు. ‘‘చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సరికాదని హైకోర్టుకు  కూడా తెలిపాం. కానీ మా వాదన అంగీకరించలేదు. గవర్నర్‌ అనుమతి లేకుండా అరెస్టు చేయడం సరికాదు. మంత్రి మండలి అనుమతితోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. ఆనాడు చంద్రబాబు సూచనలతోనే ఎక్స్‌ అఫిషియో నియామకాలు జరిగాయని అభియోగాలు మోపారు’’ అని సాల్వే పేర్కొన్నారు.  

చంద్రబాబు తరఫు మరో సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. యశ్వంత్‌ సిన్హా వర్సెస్‌ సీబీఐ కేసు ప్రస్తావించారు. సెక్షన్‌ 17ఏ ప్రకారం దర్యాప్తునకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ తీర్పులో ఉందన్నారు. దీన్ని బట్టి చూస్తే 2018 చట్టసవరణ కన్నా ముందువాటికి కూడా సెక్షన్‌ 17ఏ వర్తిస్తుందన్నారు. ఇంతలో చంద్రబాబు తరఫున మరో న్యాయవాది సిద్దార్త్‌ లూత్రా లేచి... యశ్వంత్‌ సిన్హా కేసును ఉటంకిస్తూ ‘రఫేల్‌ డీల్‌ 2015–16 నాటిది. ఇది 2018 నాటి చట్టసవరణ కన్నా ముందుదే’’ అని చెప్పారు.

ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... చంద్రబాబు తరఫున ఎంత మంది సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తారని చమత్కరించింది. నలుగురం వాదిస్తున్నామని, సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదిస్తున్నారని హరీశ్‌ సాల్వే చెప్పారు. ఈ దశలో ముకుల్‌ రోహత్గీ జోక్యం చేసుకుంటూ... వాళ్లే ఒకరి తర్వాత ఒకరు వాదనలు వినిపిస్తున్నారని తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, పిటిషనర్‌ తరఫున ఎవరో ఒకరే వాదనలు చేయాలని పేర్కొన్నారు. అయితే కింది కోర్టుల్లో ఒక సీనియర్‌ మించి వాదించే అవకాశం లేదు కానీ సుప్రీంకోర్టు ఆ ప్రత్యేక హక్కు కల్పించిందని జస్టిస్‌ బేలా ఎం త్రివేది పేర్కొన్నారు. 

ఈ దశలో కేసు మెరిట్స్‌ జోలికి వెళ్లం: సుప్రీం 
రిమాండు రిపోర్టు ప్రకారం లావాదేవీలు 2015–19 నాటివని, అంటే 2018 చట్ట సవరణ తర్వాతకూడా ఓ ఏడాది ఉంది కాబట్టి నిందితుడికి చట్టప్రకారం రక్షణ తప్పనిసరి అని సింఘ్వీ పేర్కొన్నారు. చట్ట సవరణ చేసింది నిర్దిష్ఠ రక్షణ కోసమేనని తెలిపారు. కేబినెట్‌ నిర్ణయం అని హైకోర్టు జడ్జి పేర్కొన్నారంటే ఇది అధికారిక విధులకు సంబంధించినదే కదా? అన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకొని.. ఈ దశలో కేసు మెరిట్స్‌ జోలికి వెళ్లే ఉద్దేశం లేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌ తర్వాత ఎఫ్‌ఐఆర్‌తో ఇబ్బందిపెడుతోందని, ఇది రాజకీయ కక్షసాధింపేనని లూత్రా పేర్కొన్నారు.

‘‘అసలు ప్రశ్న ఏంటంటే సెక్షన్‌ 17ఏ పీసీ యాక్టుకు మాత్రమే వర్తిస్తుందా లేక ఐపీసీకి కూడా వరిస్తుందా?’’ అని జస్టిస్‌ త్రివేదీ ప్రశ్నించారు. దీంతో పీసీ యాక్టు సెక్షన్‌ 17ఏ ను సింఘ్వీ చదువుతూ ‘ఎనీ అఫెన్స్‌’ అని ఉంది కనక పీసీ యాక్టుకు, ఐపీసీ నేరాలకు తేడా ఏమీ ఉండదని ధర్మాసనానికి చెప్పారు. సీఆర్‌పీసీ కోడ్‌ ప్రకారం సెక్షన్‌ 17ఏ సవరణ పాటించాలని లేదు కదా? అని జస్టిస్‌ త్రివేదీ ప్రశ్నించారు. పీసీ యాక్టు చూడాలని మరోసారి సింఘ్వీ పేర్కొనగా.. ఎఫ్‌ఐఆర్‌లో పీసీతోపాటు ఐపీసీ కూడా ఉందిగా? అని జస్టిస్‌ త్రివేదీ తిరిగి ప్రశ్నించారు.

‘సెక్షన్‌ 17ఏ కేవలం పీసీ చట్టానికే వర్తిస్తుంది. మరి ఐపీసీ కింద నమోదైన కేసుల పరిస్థితి ఏంటి?’’ అని జస్టిస్‌ త్రివేదీ ప్రశ్నించగా.. ఏ కేసుకైనా వర్తిస్తుందని సాల్వే పేర్కొన్నారు. చట్ట ప్రకారం సదరు వ్యక్తికి ఉన్న స్థాయిని మాత్రమే పరిగణిస్తున్నామని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ పేర్కొన్నారు. ఈ కేసులో కోర్టు  పరిశీలించాల్సింది ఒకే ఒక అంశమని, ఐపీసీ కింద నమోదైన కేసులకు 17ఏ సవరణ వర్తిస్తుందా లేదా అనేది మాత్రమే అని జస్టిస్‌ బేలా ఎం త్రివేది వ్యాఖ్యానించారు.  

దీనికి సెక్షన్‌ 17ఏ వర్తించదు: రోహత్గీ 
ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపిస్తూ... స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసుకి పీసీ చట్టం సెక్షన్‌ 17ఏ వర్తించదని స్పష్టం చేశారు. జులై 2018లో చట్ట సవరణతో సెక్షన్‌ 17ఏ చేర్చారని, ఎఫ్‌ఐఆర్‌ 2021 నాటిదైనా దర్యాప్తు చట్ట సవరణ కన్నా ముందుగానే ప్రారంభమైందని ధర్మాసనానికి తెలియజేశారు. 2018 కన్నా ముందుగా విచారణ ప్రారంభించినట్లు సంబంధిత పత్రాలు ఏమైనా ఉన్నాయా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

ఆయా పత్రాలు సమర్పిస్తామని రోహత్గి ధర్మాసనానికి తెలిపారు. కేసు దర్యాప్తు చట్ట సవరణ కన్నా ముందుగానే ప్రారంభమైందని, కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ కేసును పరిశీలించిందని తెలిపారు. ఇలాంటప్పుడు రాజకీయ కక్ష అని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు. ‘‘నేరం జరిగింది 2015–16లో. దర్యాప్తు కూడా ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు కాకముందే మొదలైంది. అలాంటపుడు రాజకీయ కక్ష అనడం సబబు కాదు కదా?’’ అని దని రోహత్గి చెప్పారు.

హైకోర్టుకు డాక్యుమెంట్లు అన్నీ సమర్పించారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని, ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. దర్యాప్తునకు సంబంధించిన అన్ని పత్రాలు సమరి్పస్తామని రోహత్గి ధర్మాసనానికి తెలిపారు. తదుపరి విచారణకు సంబంధించి పరిశీలించాల్సిన అంశాలు ఉన్నాయని, విచారణ సోమవారానికి వాయిదా వేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.

అప్పుడే ఈ పిటిషన్‌ విచారణకు తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయిస్తామని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్‌ జ్యుడీíÙయల్‌ కస్టడీలో ఉన్నారని, విచారణకు సీఐడీ కస్టడీ కోరుతున్నారని అదే కష్టంగా ఉందని లూత్రా కోర్టుకు తెలిపారు. పదిహేను రోజుల గడిచిన తర్వాత కూడా కస్టడీ కోరటం సరికాదని సిద్దార్ధ లూత్రా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. బెయిలుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించిన ధర్మాసనం... విచారణ సోమవారం చేపడతామని స్పష్టం చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement