ఖిలా వరంగల్: ‘ఆడపిల్లను కన్నావు.. అదనపు కట్నం తెస్తేనే సంసారం’అంటూ కట్టుకున్న భర్తతోపాటు అత్తామామలు వేధించారు. భరించలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్ ముష్క శ్రీనివాస్ కథనం ప్రకారం.. వరంగల్ విశ్వనాథ కాలనీకి చెందిన చిల్కూరు దేవేందర్‌రెడ్డి కుమార్తె భవానిరెడ్డి (25)కి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దొంగల రాకేశ్‌రెడ్డితో 2020లో వివాహమైంది.
వివాహ సమయంలో కట్నకానుకల కింద రూ.7లక్షల నగదు, 16తులాల బంగారం, ఇతర సామన్లు ఇచ్చారు. వీరికి ఇటీవల కుమార్తె పుట్టింది. దీంతో ‘ఆడపిల్లను కన్నావు.. ఆదనపు కట్నం తెస్తే సంసారం చేస్తా. లేకుంటే వదిలేస్తా. కట్నం తెచ్చేవరకు తల్లిగారింటి దగ్గరే ఉండు’అంటూ భర్త రాకేశ్‌రెడ్డి వేధించడం మొదలుపెట్టాడు. ఈ నెల 16న కూడా భర్త, అత్తామామలు ఫోన్ చేసి మరీ హెచ్చరించారు. దీంతో భవాని అదేరోజు ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. తల్లిదండ్రులు ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. భవాని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment